మండలి పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

మండలి పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Tue, Mar 7 2017 11:24 PM

teachers MLC elections

► 27 పోలింగ్‌ కేంద్రాలు
► ప్రతి మండల కేంద్రంలో ఓటర్లకు అందుబాటులో..
► ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి..
► నేటి సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెర


సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఈ నెల 9వ తేదీన రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 6,528 మంది ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరంతా 9వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ప్రతి మండల కేంద్రంలో పోలింగ్‌ కేంద్రం అందుబాటులో ఉంటుంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ఓటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులో లేనిచోట, బడుల్లో అరకొర సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపారు. ఉదయం 8 నంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పూర్తిగా బ్యాలెట్‌ పేపర్‌ ఆధారంగానే ఈ ఎన్నిక జరుగుతుంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల తరఫున మొత్తం 12మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్‌ తదితర సౌకర్యాలు ఉండేలా చూస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రచారం ఈ నెల 7 తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక కేంద్రాలు లేనప్పటికీ.. అన్ని కేంద్రాలపై పోలీసుల పటిష్ట నిఘా ఉంటుందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్  అమల్లో ఉంటుంది.

స్లిప్పుల పంపిణీ..
నమోదైన ఓటర్లకు ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు ఓటరు స్లిప్పుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు వెంట బెట్టుకుని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవి లేకుంటే కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

మొత్తం ఓటర్లు     :     6,528
పురుష ఓటర్లు     :     3,655
మహిళా ఓటర్లు     :     2,873
పోలింగ్‌ తేది           :     మార్చి 9
పోలింగ్‌ సమయం  :      ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు

Advertisement

తప్పక చదవండి

Advertisement