ఎస్సీ నేతలే లక్ష్యం


సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం. ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ సామాజిక వర్గం నేతలే పెత్తనం చెలాయిస్తారు. కాదని అడ్డం తిరిగితే ఆ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తారు. ఇక ఎస్సీ నియోజకవర్గాలైతే చెప్పనవసరం లేదు. తమ మాట వినకపోతే అసలు వారు రాజకీయాలకే పనికిరాకుండా చేస్తారు. ఎస్సీ ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఓ సామాజిక వర్గం నేతలు చేస్తున్న అసమ్మతి రాజకీయాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరులోనూ, ఎస్టీ నియోజకవర్గం అయిన పోలవరంలోనూ ప్రజాప్రతినిధులది ఇదే పరిస్థితి. శుక్రవారం చింతలపూడిలో జరిగే తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీలో కూడా ఇదే అసంతృప్తులు, అసమ్మతులపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

గత మూడేళ్లుగా నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను టార్గెట్‌ చేస్తూ వచ్చిన ఎంపీ మాగంటి బాబు వర్గం ఇప్పుడు మంత్రి పదవి పోవడంతో నేరుగా రంగంలోకి దిగిపోయింది. తమ మాట నెగ్గకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ ఓ వర్గం నాయకులు పదే పదే అల్టిమేటం ఇస్తూ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు దిగారు. జిల్లా ఇంఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు లేకుండా పోయింది. మూడున్నర ఏళ్లుగా ఏఎంసీ పాలకవర్గం నియామకం చేపట్టక పోవడం కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఎమ్మెల్యే సుజాత తన వర్గానికి ఈ పదవి దక్కాలని పట్టుబడుతుండగా, ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఎంపీ మాగంటి బాబుతో ఒత్తిడి తీసుకు వచ్చి తమ వర్గానికే ఈ పదవి దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు వర్గాలు తమ వారికే ఏఎంసీ పాలకవర్గ ఛైర్మ¯ŒS గిరీ ఇప్పించుకోవాలని పట్టు పడుతుండటంతో వీరి మధ్య విభేదాలు మరింత రచ్చకెక్కాయి. పీతల సుజాత దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలోకి చేరిపోయి అసమ్మతి రాగం వినిపిస్తుండటం విశేషం. చింతలపూడిలో జరిగే సమన్వయ కమిటీ సమావేశం ఎదుట బలప్రదర్శన చేయాలని నిర్ణయించడంతో పార్టీలోని అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గోపాలపురంలో కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. జెడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఈ నియోజవర్గంలో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దేవరపల్లిలో ఏఎంసీ చైర్మన్‌ ముళ్లపూడి వెంకట్రావు వర్గం ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తోంది. ఈ నెల 16న ముళ్లపూడి వెంకట్రావు వర్గం, స్థానిక సర్పంచ్‌ వర్గం ఎమ్మెల్యే ముందే కొట్టుకోవడంతో పాటు రాస్తారోకోకు దిగారు. ఆఖరికి ఎమ్మెల్యే పోలీసు రక్షణ మధ్య అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్టీఆర్‌ గృహాల మంజూరు విషయంలో జరిగిన అధిపత్య పోరు ఈ వివాదానికి దారితీసింది. రెండు నెలల క్రితం భీమడోలులో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కూడా గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీరును నిరసిస్తూ ద్వారకాతిరుమల నేతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తమను కాదని మండల అధ్యక్ష పదవిని సుంకవల్లి బ్రహ్మయ్యకు కట్టబెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీతో పాటు 12 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్‌లు, 15 మంది పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, 13 మంది నీటిసంఘం అధ్యక్షులు, 14 మంది పాలకేంద్రం అధ్యక్షులు, ఇద్దరు సొసైటీ అధ్యక్షులు, ఒక ఏఎంసీ వైస్‌ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకించి అసమ్మతి వ్యక్తం చేశారు. ఈ వివాదం సద్దుమణగక ముందే దేవరపల్లిలో గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పోలవరం నియోజకవర్గంలో కూడా ఎంపీ మాగంటి బాబు వర్గం స్థానిక ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌ను వ్యతిరేకిస్తూ, అక్కడి అసమ్మతికి మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. కొవ్వూరులో ప్రస్తుతం జవహర్‌ మంత్రి కావడంతో కొద్దిగా ఆ సామాజికవర్గం హడావిడి తగ్గించినా తెరవెనుక చక్రం తిప్పుతోంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top