హరిహరమహల్ సెంటర్లో ప్రమాదం | Soil rocks fells down in Hariharamahal center at guntur | Sakshi
Sakshi News home page

హరిహరమహల్ సెంటర్లో ప్రమాదం

May 14 2016 8:20 PM | Updated on Oct 1 2018 6:22 PM

హరిహరమహాల్ సెంటర్లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.

గుంటూరు: హరిహరమహాల్ సెంటర్లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కూలీలు 8 నుంచి 12 మంది వరకు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ పనుల్లో భాగంగా 15 మంది కూలీలతో 30 అడుగుల లోతు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. అయితే ఇప్పటివరకూ శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీయగా, శిథిలాల కింద చిక్కుకున్న వారంతా సజీవంగా ఉన్నారా లేదా అనే దానిపై ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న సహాయక బృందం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. రెండు పొక్లెయిన్లతో శిథిలాలను తొలగించి కూలీలను రక్షించేందుకు యత్నిస్తోంది. చీకటిగా ఉండటంతో శిథిలాలను తొలగించడానికి తగు చర్యలను అధికారులు చేపడుతున్నారు. ఈ రాత్రింతా సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. రెండు అంబులెన్స్లను ఘటనా స్థలి వద్ద ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూలీల బంధువులను ఘటనా స్థలి లోపలికి అధికారులు అనుమతించడం లేదు. దాంతో వారంతా తమవారికి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న వారు పత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన వారిగా గుర్తించారు. భాగ్యారావు, శేషు, ప్రశాంత్, రాజేశ్, బబ్లూ, సుధా, మోషే, సల్మాన్లు చిక్కుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement