హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో పెద్దమండ్యం మండలంలో పూర్తిచేయాల్సిన సొరంగం పనుల అప్పగింతకు కాంట్రాక్టర్ల అర్హత తగ్గింపు, టెండర్లకు కాల పరిమితి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ఎక్కువ టెండర్లు దాఖలవుతాయని భావిస్తోంది.
సొరంగం పనులకు నిబంధనల సడలింపు
Jul 21 2016 11:11 PM | Updated on Sep 4 2017 5:41 AM
– టెండర్ల దాఖలు కాలపరిమితి 14రోజులకు పెంపు
– సాంకేతిక అర్హత 50శాతానికి తగ్గింపు
– ఈనెల 25నుంచి ఆగస్టు 8 వరకు టెండర్లు
బి.కొత్తకోట: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో పెద్దమండ్యం మండలంలో పూర్తిచేయాల్సిన సొరంగం పనుల అప్పగింతకు కాంట్రాక్టర్ల అర్హత తగ్గింపు, టెండర్లకు కాల పరిమితి పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ఎక్కువ టెండర్లు దాఖలవుతాయని భావిస్తోంది. 20బీ ప్యాకేజీలోని సొరంగం పనులకు నిర్వహించిన టెండర్లలో మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ఒక్కటే 3.99శాతం ఎక్కువతో సింగిల్ టెండర్ దాఖలు చేయడం, దాన్ని ప్రభుత్వం రద్దుచేయడం తెలిసిందే. పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం మండలం కోటగడ్డకాలనీ వరకు మట్టిలో సొరంగ మార్గానికి చెందిన 20ఎ ప్యాకేజీ పనిలో రూ.16.77కోట్ల విలువైన 2కిలోమీటర్ల మట్టిసొరంగం పనుల విలువను రూ.70.82కోట్లకు పెంచారు. దీనికి గతనెలలో టెండర్లు నిర్వహించినా ఒకటే టెండర్ దాఖలైంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జీవోల ఆధారంగా టెండర్లు దాఖలుచేసే కాంట్రాక్టు సంస్థలకు ఉండాల్సిన సాంకేతిక అర్హత, అనుభవంలో 50శాతం మేరకు తగ్గిస్తోంది.
పెద్దమండ్యం మండలంలో సొరంగం పనులు చేసేందుకు నిబంధనల మేరకు 16వేల క్యూబిక్ మీటర్ల సొరంగం కాంక్రీట్ పనులు, 2.5 కిలోమీటర్ల సొరంగం పనులను ఏడాది కాలంలో చేసిన అనుభవం ఉండాలి. అయితే 20బీ ప్యాకేజీ పనులకోసం సాంకేతిక అర్హతలను 50శాతానికి కుదిస్తున్నారు. సొరంగం పని అప్పగించేందుకు టెండర్లు దాఖలుచేసే కాంట్రాక్టు సంస్థ ఏడాది కాలంలో 1.25కిలోమీటర్ల సొరంగం పనులు, 8వేల క్యూబిక్ మీటర్ల సొరంగం కాంక్రీట్ పనులుచేసిన అనుభవం ఉంటే చాలాని నిర్ణయించనుంది. ఈమేరకు ఈనెల 25నుంచి టెండర్లు ఆహ్వనించేలా ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో టెండర్లను వారంలో పూర్తిచేసేవారు. ప్రస్తుతం ఈ టెండర్లకు రెండు వారాలకు గడువు పెంచుతున్నారు. దీంతో ఈనెల 25న టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆగస్టు8కి ముగించనున్నారు. దీనికోసం చర్యలు తీసుకొంటున్నారు.
Advertisement
Advertisement