దారి దోపిడీ | robbery on roads | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ

Nov 17 2016 11:31 PM | Updated on Aug 30 2018 5:27 PM

దారి దోపిడీ - Sakshi

దారి దోపిడీ

దోపిడీ దొంగలు తెగబడ్డారు. కర్నూలు శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు.

కర్నూలు: దోపిడీ దొంగలు తెగబడ్డారు. కర్నూలు శివారులోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా కొంత దూరంలో ఉన్న డాబా వద్దకు చేరుకొని నిర్వాహకుడిని బెదిరించారు. డాబాలో దోపిడీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యాయి. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా దొంగలను గుర్తించారు.వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
 
అనంతపురం జిల్లా విజిలెన్స్‌ డీఎస్పీ రాజేశ్వరరెడ్డికి సంబంధించిన శుభకార్యం హైదరబాదులో జరిగింది. సమీప బంధువులు(పరసన్నాయిపల్లె) కార్యక్రమానికి హాజరై బుధవారం రాత్రి ఏపీ02 ఏటీ1111 వాహనంలో అనంతపురం వెళ్తుండగా కార్బైడ్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న మానస డాబా దగ్గర టైరు పంచర్‌ అయింది. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. డ్రైవర్‌ గోపాల్‌రెడ్డి  టైరు పంచర్‌ చేయిస్తుండగా ముగ్గురు దొంగలు ఫుల్‌గా మద్యం సేవించి డాబా వద్దకు వెళ్లి కారు డ్రైవర్‌ గోపాల్‌ రెడ్డిని డబ్బులు డిమాండ్‌ చేశారు. అతను నిరాకరించడంతో కత్తితో పొడిచి గాయపరిచారు. కారులో ఉన్న ముగ్గురు మహిళలను కూడా బెదిరించి డ్యాష్‌ బోర్డుపై ఉన్న ట్యాబ్‌ను దొంగలించారు. అక్కడి నుంచి మోటర్‌సైకిల్‌పై దూపాడు దగ్గరికి చేరుకుని కల్పన డాబా నిర్వాహకుడు బోయ సతీష్‌ను గొంతు నులిమి బెదిరించి డాబాలో దోపిడీకి పాల్పడ్డారు. నగదుతో పాటు సిగరెట్‌ ప్యాకులను దొంగలించుకుని అక్కడినుంచి పరారయ్యారు. ఉలిందకొండ సమీపంలో మూడు లారీలను అటకాయించి డ్రైవర్లను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.
ముమ్మర గాలింపు..
దారి దోపిడీ విషయం తెలిసిన వెంటనే కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెల్లవారుజాము వరకు దొంగల కోసం గాలించారు. కల్పన డాబాలో సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దోపిడీకి పాల్పడిన యువకులను గుర్తించారు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఉలిందకొండ, నాగలాపురం, కర్నూలు పీసీఆర్‌ ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగలాపురానికి చెందిన  పాత నేరస్తుడు ఇమ్రాన్‌ను సీసీ పుటేజీలోగుర్తించి, అతని ద్వారా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేష్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, కార్తీక్, సాయితేజ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నేరానికి పాల్పడకముందు, తర్వాత వీరు ఆస్పత్రికి ఎదురుగా ఉన్న రమా లాడ్జ్‌లో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించి అదపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీస్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరి నుంచి ఎఫ్‌జెడ్‌ ద్విచక్ర వాహనంతో పాటు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
ఆగస్టులో ఇదే తరహాలో దోపిడీ...
 ఇదే తరహాలో ఆగస్టు మొదటి వారంలో  నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఇదే దొంగలు దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. పాండిచ్చేరికి చెందిన లారీలను నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆపి డ్రైవర్, క్లీనర్లను చితకబాది వారి దగ్గర ఉన్న డబ్బులు దోచుకున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నంద్యాల చెక్‌పోస్టు నుంచి తాండ్రపాడు వరకు ద్విచక్ర వాహనంపై చక్కర్లు కొడుతూ పలు లారీలను అడ్డుకుని దోపిడీ చేశారు. దోపిడీకి గురైన వాహనాలన్నీ ఓర్వకల్లు దాటిన తర్వాత ఒకచోట ఆపుకున్నప్పుడు ఒకరికొకరు జరిగిన సంఘటన గురించి చెప్పుకున్నారు. లారీ డ్రైవర్లు తిరిగి కర్నూలుకు వచ్చి ఇదే విషయాన్ని మూడో పట్టణంలో ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో దొంగల నుంచి భారీగా ముడుపులు దండుకుని లారీ డ్రైవర్ల ఫిర్యాదును పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. జాతీయ రహదారులపై రాత్రివేళల్లో పోలీసు గస్తీ, నిఘా కొరవడటం వల్లే తరచూ ఇలాంటి దారి దోపిడీలు చోటు చేసుకుంటున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement