దోచిపెట్టేందుకేనా..? | ramagiri mpdo building vandalised | Sakshi
Sakshi News home page

దోచిపెట్టేందుకేనా..?

May 22 2017 12:19 AM | Updated on Jul 6 2019 1:14 PM

దోచిపెట్టేందుకేనా..? - Sakshi

దోచిపెట్టేందుకేనా..?

రాతి కట్టడంతో పటిష్టంగా ఉన్న రామగిరి మండల పరిషత్‌ కార్యాలయాన్ని కూల్చి.. దాని స్థానంలో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

బాగున్న భవనం కూల్చివేతకు రంగం సిద్ధం
రూ.కోటితో రామగిరి ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి ఏర్పాట్లు
అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు మహిళా మంత్రి ఎత్తుగడ?


రాతి కట్టడంతో పటిష్టంగా ఉన్న రామగిరి మండల పరిషత్‌ కార్యాలయాన్ని కూల్చి.. దాని స్థానంలో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భవనం కూలే దశలో ఉందని కానీ, మరమ్మతులు అవసరం అని కానీ స్థానిక అధికారులు నివేదిక ఇవ్వకపోయినా నూతన భవనం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు మంజూరు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ వారికి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఓ మంత్రి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
- అనంతపురం సిటీ


జిల్లాలో వజ్రకరూరు, తలుపుల మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. తలుపులలో ఎంపీడీఓ కార్యాలయాన్ని రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. గతంలోనే నూతన భవనానికి నిధులు మంజూరైనా స్థానిక నేతల విభేదాల వల్ల నిర్మాణం ముందుకు సాగలేదు. ఇటువంటి వాటిపై దృష్టి సారించకుండా కాలం తీరని రామగిరి మండల పరిషత్‌ కార్యాలయ భవనాన్ని కూల్చేసి కొత్తగా నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలారు. ఓ మంత్రి చొరవతోనే ఉన్నతాధికారులు ప్రణాళికలు తయారు చేయడంతో మూడు నెలల కిందట కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి.

వారం రోజుల్లో కార్యాలయం ఖాళీ చేయాలని మంత్రి వర్గీయులు చెప్పారని మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బరావును వివరణ కోరగా టెండరుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌కు పంపామన్నారు. వారంలోపు సమాచారం వస్తుందని, టెండరు ఎవరికి దక్కిందనేది అప్పుడు చెబుతామని అన్నారు. ప్రస్తుతమున్న భవనం శిథిలావస్థలో ఉందని, నూతన నిర్మాణం అవసరమని తాము ఎవరికీ నివేదించలేదని రామగిరి ఎంపీడీఓ పూల నరసింహులు తెలిపారు. ఒక వేళ పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు ఏమైనా ప్రణాళిక పంపారేమో తమకు తెలియదన్నారు. వారంలోపు కార్యాలయం ఖాళీ చేయాలని మంత్రి నుంచి సమాచారం అందిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement