
టీడీపీ వైఖరికి నిరసనగా పులివెందులలో ర్యాలీ
తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా శుక్రవారం సాయంత్రం పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మతో స్థానిక పూలంగళ్ల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
పులివెందుల : తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా శుక్రవారం సాయంత్రం పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మతో స్థానిక పూలంగళ్ల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు డౌన్ డౌన్, చేత కాని సీఎం డౌన్ డౌన్, వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలంగళ్ల సర్కిల్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలప్పుడు అనేక అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు.
గడిచిన రెండేళ్ల నుంచి ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలను తీర్చడానికి పోరాడుతుంటే.. చంద్రబాబు తన మంత్రులతో వైఎస్ జగన్ మీద అవాకులు.. చవాకులు మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మూల కారణమైన ప్రత్యేక హోదా గురించి కానీ, తెలంగాణా ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల గురించి కానీ చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడానికి నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను తాము తగలబెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు ఎర్ర గంగిరెడ్డి, వేముల సాంబశివారెడ్డి, బండి రామమునిరెడ్డి, రసూల్ సాహేబ్, సర్వోత్తమరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, వీరభద్రారెడ్డి, చంద్రమౌళి, కౌన్సిలర్లు కోళ్ల భాస్కర్, వెంకటరమణ, భగవాన్, మున్నారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.