చరిత్రలో పోరుగడ్డ

చరిత్రలో పోరుగడ్డ - Sakshi


జనగామ : పోరుగడ్డగా పేరొందిన జనగామ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కొత్త జిల్లాగా ఏర్పాటైన అనతికాలంలోనే చరిత్ర సృష్టించింది. వీరనారిలు రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బాలికలు ఆత్మరక్షణపై మహా ప్రదర్శన చేపట్టారు. మండుటెండలో 36 నిమిషాల పాటు కరాటే విన్యాసా లు చేపట్టి అబ్బురపరిచారు.  తాము నేర్చుకున్న నైపుణ్యాలను క్రమ పద్ధతిలో ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. సెల్ఫ్‌డిఫెన్స్‌పై మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది న విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు సంపాదించారు. ఈ మహాత్తర వేడుకను మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు.



13,683 మంది విద్యార్థినులు.. 36 నిమిషాల ప్రదర్శన..

బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కలెక్టర్‌ శ్రీదేవసేన సెల్ఫ్‌ డిఫెన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బాలికలు, మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ మేరకు కలెక్టర్‌ బాలికలకు ఆత్మరక్షణపై శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్‌ 4వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా రుద్రమదేవి సెల్ఫ్‌ అకాడమీ మార్షల్‌ ఆర్ట్స్‌ ఇన్‌స్ట్రక్టర్లు లక్ష్మి, రవి శిక్షణ ఇచ్చారు. విద్యాలయాల్లో ఇచ్చిన శిక్షణను ధర్మకంచ ఇండోర్‌ స్టేడియంలో ఇండిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొడక్షన్‌ స్కీం (ఐసీపీఎస్‌) ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సంఘటిత సబల’ పేరుతో ప్రదర్శించారు. జిల్లా నలుమూలల నుంచి 157 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 13,683 మంది విద్యార్ధినులుతరలివచ్చారు. ఎలక్ట్రానిక్‌ మిషన్ల ద్వారా బాలికల సంఖ్యను లెక్కించారు. ఉదయం 11:39 నిమిషాలకు ప్రారంభమైన ప్రదర్శన మధ్యాహ్నం 12:15 ముగిసింది. గిన్నిస్‌ బుక్‌ రికార్డు భారత  ప్రతినిధిగా జైసింహ, టైమర్‌గా చందూ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో మహా ప్రదర్శన కొనసాగింది. 36 నిమిషాల పాటు సాగిన ప్రదర్శనను డ్రోన్‌ కెమెరాల సాయంతో రికార్డు చేశారు. కాగా, జనగామ ప్రపంచ రికార్డును సృష్టించడంతో మంత్రి అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గాలిలోకి బెలూన్లు ఎగురవేశారు.



‘గ్రేట్‌ జనగామ’ నినాదాలు..

వేలాదిగా తరలివచ్చిన విద్యార్థినులను ఉత్తేజపరిచేందుకు కరాటే ఇన్‌స్ట్రక్టర్టు లక్ష్మి, రవి ద గ్రేట్‌ జనగామ అంటూ నినాదాలు చేశారు. 13 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న 13,683 మంది విద్యార్థినులు, 450 మంది అంగన్‌వాడీ కార్య కర్తలు, 10 మంది సీనియర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్లు, ఉపాధ్యాయినులు, పీఈటీలు పాల్గొన్నారు. ఇన్‌స్ట్రక్టర్లు లక్ష్మి, రవి 25 అంశాల్లో సెల్ప్‌ డిఫెన్స్‌పై విద్యార్థినులతో విన్యాసాలు చేయించారు.



హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు..

సంఘటిత సబల ప్రదర్శన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టూరిజం శాఖమంత్రి అజ్మీరా చందూలాల్, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మ, శాసన మండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బూర నర్సయ్యగౌడ్,  ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో పాటు వరంగల్‌ సీపీ సుధీర్‌బాబు, జేసీ గోపాలకృష్ణాప్రసాద్‌రావు, డీసీపీ వెంకన్న, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి,  మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పద్మ, వైస్‌ చైర్మన్‌ వెంకట్, డీపీఓ రవికుమార్, డీఈఓ యాదయ్య, డీఏఓ వీరునాయక్‌ పాల్గొన్నారు.



ఇండియన్‌ వరల్డ్‌ రికార్డు పత్రాల అందజేత

ప్రపంచ స్థాయిలో ఎక్కడ జరగని విధంగా సంఘటిత సబల ప్రదర్శన గిన్సిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది. 36 నిమిషాల పాటు సాగిన ప్రదర్శన అనంతరం ఇండియన్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ శ్రీదేవసేనకు అందజేశారు.



రుద్రమదేవి, ఐలమ్మకు నిజమైన వారసులు : డిప్యూటీ సీఎం కడియం

నూతనంగా ఏర్పడిన జనగామ జిల్లా విద్యార్థినులు గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించి రాణిరుద్రమదేవి, చాకలి ఐలమ్మకు నిజమైన వారసులుగా నిలిచారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 13,683 మంది 36 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమన్నారు. బాలికల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. త్వరలో జిల్లా కలెక్టరేట్‌ ఇంటిగ్రేటెట్‌ సముదాయాన్ని నిర్మించబోతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జనగామలో ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. రాబోయే ఏడాదిలో ఎస్సీ బాలికల కోసం 104, ఎస్టీలకు 51, మైనార్టీలకు 71, వెనకబడిన విద్యార్థినుల కోసం 119 గురుకుల విద్యాలయాలను నెలకొల్పబోతున్నామన్నారు. కాగా, మహా ప్రదర్శన నిర్వహించేందు కు కృషి చేసిన కలెక్టర్‌ శ్రీదేవసేనను, పాల్గొన్న విద్యార్థులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top