శాంతియుతంగా చేసే నిరసనలను, ఆందోళనలను టీడీపీ ప్రభుత్వం అణచి వేస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష హెచ్చరించారు.
	హైదరాబాద్ సిటీ: శాంతియుతంగా చేసే నిరసనలను, ఆందోళనలను టీడీపీ ప్రభుత్వం అణచి వేస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష హెచ్చరించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నగరికి వెళ్లి నిరసన తెలపాలని ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కడపలో ఇద్దరు ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామికమన్నారు.
	
	నగరి మున్సిపల్ ఛైర్మన్ కుటుంబీకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ధర్నా చేయాలనుకోవడం కూడా నేరమేనా? అని ఆయన ప్రశ్నించారు. నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు విద్యార్థినుల మృతికి నిరసనగా బంద్ చేస్తూంటే తమ ఎమ్మెల్యేలను ఆందోళనలో పాల్గొనకుండా చేయడం నీచమన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు చనిపోతోంటే కనీసం విచారణకు ఆదేశించడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నో ఆశలతో తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని కూలీ నాలీ చేసిన డబ్బుతో చాలా మంది తల్లిదండ్రులు నారాయణ కళాశాలలకు పంపుతున్నారని వారు మరణిస్తే ఆ శోకం ఎలాంటిదో ప్రభుత్వం తెలుసుకోవాలని ఆయన అన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
