జిల్లాలో ఇటీవల నిర్వహించిన మండలాభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల్లో మరోసారి మార్పులు
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ఇటీవల నిర్వహించిన మండలాభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. మెళియాపుట్టి ఎంపీడీవోగా పనిచేస్తున్న చంద్రకుమారిని తొలుత వీరఘట్టంలో నియమించగా... విజయనగరం జిల్లాలో పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవులో ఉన్న బి.అరుణను మందసకు కేటాయించారు.
అయితే మెళియాపుట్టి ఎంపీడీవో చంద్రకుమారి వీరఘట్టం వెళ్లేందుకు సుముఖంగా లేక పోవడంతో ఆమెను మందసకు మార్చారు. అలాగే విజయనగరం జిల్లాలో పని చేసిన అరుణను వీరఘట్టంలో నియమించేందుకు జిల్లా పరిషత్ యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది.
అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన ఆచార్యులను జిల్లాకు కేటాయించడంతో అతన్ని సోంపేట ఎంపీడీవోగా నియమించేందుకు నిర్ణయించారు. అతనికి పదోన్నతి కల్పించినా వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ మార్పులకు చైర్‌పర్సన్ పచ్చజెండా ఊపే అవకాశం ఉందని కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది.