కౌంటర్‌ తెరవలే..! | Non-shorter loan lending procedure in 26 bank branches | Sakshi
Sakshi News home page

కౌంటర్‌ తెరవలే..!

Jul 5 2017 1:45 AM | Updated on Sep 5 2017 3:12 PM

కౌంటర్‌ తెరవలే..!

కౌంటర్‌ తెరవలే..!

బ్యాంకర్ల తీరు మారడం లేదు. రైతన్నలకు పంట రుణాల మంజూరులో ఆలసత్వం వీడటం లేదు.

► 26 బ్యాంకు శాఖల్లో షురూ కాని పంట రుణ  మంజూరు ప్రక్రియ
►  12 శాతం దాటని ఖరీఫ్‌ రుణాలు
►  జిల్లాలో 33 శాతం పూర్తయిన సాగు విస్తీర్ణం
► ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతన్నలు


సాక్షి, నిజామాబాద్‌:     బ్యాంకర్ల తీరు మారడం లేదు. రైతన్నలకు పంట రుణాల మంజూరులో ఆలసత్వం వీడటం లేదు. జిల్లాలో ఖరీఫ్‌ సాగు మూడో వంతు పూర్తయినప్పటికీ, 26 బ్యాంకుల శాఖలు ఇప్పటి వరకు పంట రుణాల మంజూరు ప్రక్రియను అసలు షురూ చేయలేదంటే రైతుల పట్ల బ్యాంకర్ల తీరును అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని బ్యాంకుల శాఖలు సైతం నామమాత్రంగా రుణం మంజూరు చేశాయి. జిల్లాలో ఖరీఫ్‌ పనులు ఊపందుకున్నాయి.

బోధన్, వర్ని తదితర మండలాల్లో పక్షం రోజుల క్రితమే వరి నాట్లు వేసుకున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌  నియోజకవర్గాల పరిధిలో సోయా, పసుపు వంటి పంటలు విత్తుకున్నారు. ఈ సీజనులో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా కాగా, ఇప్పటికే 33 శాతం (1.33 లక్షల ఎకరాల్లో) పంటలు వేసుకున్నారు. కానీ పంట రుణాలు మాత్రం 12 శాతానికి మించలేదు. ఈసారి ఖరీఫ్‌లో సుమారు 2.38 లక్షల మంది రైతులకురూ.1,560.82 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.

కానీ జూన్‌ నెలాఖరు వరకు కేవలం 26 వేల మంది రైతులకు రూ.172.65 కోట్లు మాత్రమే రుణం ఇవ్వగలిగారు. అంటే ఖరీఫ్‌ పనులు ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కనీసం 12 శాతం కూడా రుణాలు ఇవ్వలేదన్నట్లు స్పష్టమవుతోంది. ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు బ్యాంకులు ఖరీఫ్‌ రుణాలు మంజూరు చేస్తాయి. అయితే నిర్దేశించిన గడువులో నెల రోజులు ముగిసినప్పటికీ రుణ మంజూరు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వడ్డీ వ్యాపారులే దిక్కు..
ఎప్పటిలాగే ఈసారి కూడా ఖరీఫ్‌ సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. చాలా చోట్ల రైతులు వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇందులో దుక్కులు దున్నడం కోసం ట్రాక్టర్, అరక ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటాయి. అలాగే ఎరువులు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడులు కావాలి. వీటికి తోడు కూలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలివ్వక పోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రుణ ప్రక్రియ ప్రారంభించని బ్యాంకుల పరిధిలోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

ఆన్‌లైన్‌ పహణీలతోనే ఇబ్బందిగా ఉంది
పంటరుణాలు తీసుకోవడమేమోగాని, ఆన్‌లైన్‌ పహణీలతోనే రైతులకు తీవ్ర ఇబ్బంది ఉంది. వేల్పూర్‌ మండలంలో చాలా మంది రైతులకు సంబంధించి ఆన్‌లైన్‌లో భూముల వివరాలు ఉండడం లేదు. ఆన్‌లైన్‌ పహణీ లేకుంటే బ్యాంకు వారు ఒప్పుకోవడం లేదు. బ్యాంకు వారిని ఎంతో బతిమాలితే రాతపూర్వక పహణీకి ఒప్పుకుంటున్నారు. రాత పూర్వక పహణీ కోసం కనీసం నాలుగైదు రోజుల సమయం తీసుకుంటోంది. వీఆర్వోలకు రెవెన్యూ సర్వే ఉండడం వల్ల వారు సర్వేకే వెళ్తున్నారు. ఆన్‌లైన్‌ పహణీలే ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు పచ్చలనడ్కుడ గ్రామీణ బ్యాంకులో మేనేజరు లేక రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల ఒక అధికారిని ఇన్‌చార్జిగా పంపించారు. భూములకు ఆన్‌లైన్‌ సమస్యను తీర్చడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నవీన్‌రెడ్డి, రైతు,వాడి

మేనేజరు లేక సతమతం
వేల్పూర్‌ ఎస్‌బీహెచ్‌ బ్యాంకు మేనేజరు బదిలీ అయి సుమారు నెలరోజులవుతోంది. కొత్త మేనేజరు ఇంతవరకు రాలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారు.పంట రుణాల రెన్యూవల్‌కు  చాలా సమయం తీసుకుంటోంది. పంటరుణం రెన్యూవల్‌ చేయించుకోవడం రైతులకు కష్టంగా మారింది. గంటల తరబడి బ్యాంకులో ఉండాల్సి వస్తోంది. భూములకు సంబంధించి ఎటువంటి తాకట్టు లేదని నిరూపించుకోడానికి మీసేవా నుంచి ఈసీ తెమ్మంటున్నారు. ఇది అదనంగా రైతులకు భారంగా మారింది. మేనేజరును, సిబ్బందిని నియమించి, పంటరుణాలు తొందరగా రెన్యూవల్‌ చేయాలి. – గడ్డం సత్యం. రైతు, వేల్పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement