ప్రియుడి చేతిలో మోసపోయి..!

ప్రియుడి చేతిలో మోసపోయి..!


రాయచోటి: ఆమెను ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తీసుకొచ్చి మధ్యలోనే వదిలేశాడు. అటు ఇంటికి వెళ్లలేక.. ఇటు బయట ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులకు పట్టుబడింది. ఆమె దయనీయ గాథను తెలుసుకున్న పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అక్కడి కృషి నగర్‌కు చెందిన మహేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఈ ఊరిలో ఉంటే మనల్ని పెళ్లి చేసుకోనీయరని నమ్మించి 2013వ సంవత్సరంలో ఆమెతో సహా కడపకు వచ్చాడు.అక్కడి ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలిపెట్టి మళ్లీ వస్తానని చెప్పి పారిపోయాడు. ఈ పరిస్థితిలో పరువు పోతుందని ఆమె ఇంటికి వెళ్లలేకపోయింది. ఆమె తండ్రి, సోదరులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. అప్పటినుంచీ అటు పోలీసులతో పాటు ఇటు కుటుంబసభ్యులు కూడా వెతికి ఫలితం లేదని వదిలేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ లో మునీరు అనే మహిళతో ఆ యువతికి అపట్లో పరిచయమైంది. తనతో వస్తే జీవనోపాధి చూపిస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలోకి దింపింది. శుక్రవారం రాత్రి ఆమె రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంలో పోలీసులకు పట్టుబడింది.వృభిచార గృహ నిర్వాహకురాలు మునీరులో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువతి ఫ్యామిలీకి సమాచారం అందించడంతో ఆమె సోదరులు శనివారం రాయచోటికి వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత తమ సోదరి కనిపించిందని వారు ఎంతో సంతోషించారు. అయితే ఇలా వ్యభిచార గృహంలో పోలీసుల చేతికి చిక్కడం వారికి ఒకింత బాధ కలిగించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top