కర్నూలుకు జపాన్‌ ప్రధాని? | japan prime minister visit to kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలుకు జపాన్‌ ప్రధాని?

Oct 17 2016 11:31 PM | Updated on Sep 4 2017 5:30 PM

కర్నూలుకు జపాన్‌ ప్రధాని?

కర్నూలుకు జపాన్‌ ప్రధాని?

ర్నూలు జిల్లాకు జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబే రానున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో వచ్చే అవకాశం!
– అతిపెద్ద సోలార్‌ పార్కు ప్రారంభోత్సవానికి హాజరు
– ప్రధాని మోదీతో కలిసి వచ్చే సూచనలు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాకు జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబే రానున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కు ప్రారంభోత్సవానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జపాన్‌ ప్రధానమంత్రిని కూడా హాజరుకానున్నట్టు విశ్వసనీయవర్గాలు ద్వారా తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో సోలార్‌ పార్కు ప్రారంభోత్సవానికి ఇరు దేశాల ప్రధానులు హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాల ద్వారా సమాచారం. జిల్లాలోని గని, శకునాల వద్ద 1000 మెగావాట్ల సోలార్‌ పార్కు ఏర్పాటు కానుంది. ఇందుకోసం టెండర్‌ ద్వారా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంకు 500 మెగావాట్ల సోలార్‌ పార్కు ఏర్పాటుకు పనులను దక్కించుకుంది. అదేవిధంగా సన్‌ ఎడిషన్‌ సంస్థ 350 మెగావాట్ల పనులను టెండర్‌ ద్వారా దక్కించుకుంది. అయితే, ఆర్థిక ఇబ్బందులతో ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఈ సంస్థ స్థానంలో గ్రీన్‌కో ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సోలార్‌ పార్కు పనులు వేగవంతం కానున్నాయి. ఏప్రిల్‌ నాటికి సిద్ధమయ్యే ఈ పార్కు ప్రారంభోత్సవానికి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు ద్వారా ఏకంగా ఆ దేశ ప్రధానిని రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సదరు సంస్థ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. కర్నూలు జిల్లా జపాన్‌ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వనుందని ప్రభుత్వవర్గాలు 'సాక్షి'కి వివరించాయి. కర్నూలు జిల్లా చరిత్రలోనే ఏకంగా ఇతర దేశ ప్రధానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చే ఏడాది మే నెలలో దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
 
ఏప్రిల్‌ నాటికి సిద్ధం..
కర్నూలు జిల్లాలోని గని, శకునాల వద్ద 1000 మెగావాట్ల సోలార్‌ పార్కు ఏర్పాటుకు గత ఏడాది టెండర్లను పిలిచారు. ఈ పార్కు 3,150 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. ఇందుకోసం భూ సేకరణ దాదాపుగా పూర్తయింది. ఇందులో 500 మెగావాట్ల పార్కును జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు దక్కించుకుంది. ఇక 350 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ పనులను సన్‌ ఎడిసన్‌ అనే సంస్థ దక్కించుకుంది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సంస్థ కాస్తా వెనక్కి తగ్గింది. ఈ సంస్థ స్థానంలో తాజాగా గ్రీన్‌కో ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకోసం ఇప్పటికే 150 మెగావాట్ల కోసం మెగావాట్‌కు రూ.42 లక్షల చొప్పున మొత్తం నగదును పార్కును అభివృద్ధి చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌పీసీఎల్‌)కు చెల్లించింది. మరో 200 మెగావాట్లకు త్వరలో డబ్బు చెల్లించనుంది. ఇప్పటికే 500 మెగావాట్లకు అవసరమైన డబ్బును సాఫ్ట్‌బ్యాంకు కూడా చెలి​‍్లంచింది. ఇక అజూర్‌– 100 మెగావాట్లు, ప్రయత్న– 50 మెగావాట్ల పనులను దక్కించుకున్నారు. మొత్తం మీద సోలార్‌ పార్కు పనులు ఈ ఏడాది చివరకే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో సాధ్యం కాలేదు. తాజా పరిణామాలతో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సోలార్‌పార్కు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇరు దేశాల ప్రధానుల చేతుల మీదుగా సోలార్‌పార్కులో అధికారికంగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. 
 
వేగం పుంజుకోనున్న పనులు
వాస్తవానికి గని, శకునాల ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే, అనేక మంది రైతులకు నష్టపరిహారం అందకపోవడంలో ఆలస్యం జరిగింది. మొదట్లో రైతులకు భూ యాజమాన్య హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఆర్‌డీఓల నివేదికలో వారికి భూములు లేవంటూ తేల్చారు. దీంతో ఈ రైతులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) ఆధ్వర్యంలో మరోసారి నివేదిక తయారుచేశారు. ఇందులో అనేక మంది రైతులకు నష్టపరిహారం అందించేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయని స్వయంగా జేసీ విచారణలో తేల్చారు. ఈ మేరకు గత వారంలో ప్రభుత్వానికి స్వయంగా నివేదిక కూడా అందజేశారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు అనుమతి వచ్చిన వెంటనే సోలార్‌పార్కు పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement