చిన్న నీటి చెరువుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఏళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోని చెరువులను మరమ్మతు చేసి, పూర్తి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
-
అంతంతగానే ఆయకట్టున్నా.. అధిక వ్యయం
-
నీటి పారుదల శాఖలో జిమ్మిక్కులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : చిన్న నీటి చెరువుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఏళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోని చెరువులను మరమ్మతు చేసి, పూర్తి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. జిల్లాలో మొత్తం 1,491 చెరువులున్నాయి. ఇందులో మొదటి విడతలో 20 శాతం అంటే 605 చెరువులను ఈ పథకం కింద ఎంపిక చేశారు. సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆయా చెరువుల ఆయకట్టు.. మరమ్మతుకు వెచ్చించాల్సిన నిధుల అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే.. ఈ చెరువుల ఆయకట్టు లెక్కల్లో అధికారులు జిమ్మిక్కులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అంతంత మాత్రం ఆయకట్టు ఉన్న చెరువులను కూడా వందల ఎకరాలుగా చూపి, అంచనా వ్యయాలను పెంచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజాధనం రూ.లక్షల్లో ఖర్చయినా, ఆయా చెరువుల పనులతో ప్రయోజనం ఆశించిన స్థాయిలో ఉండటం లేదనే అభిప్రాయం ఉంది. మరోవైపు పెరిగిన ఈ అంచనాలు కాంట్రాక్టర్లకు భారీగా కలిసొచ్చేలా చేసిందనే విమర్శలూ ఉన్నాయి.
బినామీలే గుత్తేదార్లు..?
మిషన్ కాకతీయ పథకం చెరువులంటే అధికార పార్టీ నేతలే పనులు చేస్తుండటం సాధారణం. కానీ.. కొన్ని మండలాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారుల బినామీలే గుత్తేదార్ల అవతారమెత్తారనే ఆరోపణలున్నాయి. తమ సమీప బంధువులతో చెరువుల పనులు చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఆయా చెరువుల పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయనే విమర్శలున్నాయి. ఈ విషయం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావనకు వస్తే.. ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు డిపాజిట్ డీడీల కోసం డబ్బులు అత్యవసరం పడితే సర్దుబాటు చేశామే తప్ప, తాము ఎలాంటి కాంట్రాక్టు పనులు చేయడం లేదని.. సదరు అధికారులు సర్ది చెప్పుకున్నట్లు సమాచారం. అలాగే ఆయా చెరువుల పనుల నివేదికల్లోనూ అధికారులు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. చిన్న చిన్న పనులు ఇంకా మిగిలే ఉన్నప్పటికీ నివేదికల్లో మాత్రం పూర్తయినట్లు పేర్కొంటున్నారు.
ఆయకట్టు పెంచలేదు..
– విఠల్, డీఈ నీటి పారుదల శాఖ
మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల ఆయకట్టు పెంచే ప్రసక్తే లేదు. ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టు బట్టే పనుల అంచనాలను తయారు చేశాం. తక్కువ ఆయకట్టు ఉన్నప్పటికీ ఎక్కువ వ్యయంతో పనులు చేశారనేది అవాస్తవం.