రైతులకు హక్కుగా దక్కాల్సిన వాతావరణ బీమా పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్స్ కంపెనీ అలసత్వం ప్రదర్శిస్తోంది.
– ఇప్పటికీ అందని వాతావరణ బీమా
– బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
– నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న ఇన్సూరెన్స్ కంపెనీ
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
రైతులకు హక్కుగా దక్కాల్సిన వాతావరణ బీమా పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్స్ కంపెనీ అలసత్వం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి గతేడాది అక్టోబరు 10లోపే పూర్తిగా పరిహారాన్ని చెల్లించాలి. అయితే.. నేటికీ చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా దక్కడంలో ఇబ్బందులు ఎదురైతే అండగా ఉండి, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వెరసి ‘అనంత’ రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది.
వాతావరణ ఆధారిత పంటల బీమాకు వేరుశనగ రైతులు గతేడాది ఖరీఫ్‌లో ప్రీమియం చెల్లించారు. పంట దిగుబడితో పనిలేకుండా జిల్లా సగటు వర్షపాతం, నమోదైన వర్షపాతం, వాతావరణ పరిస్థితులను లెక్కగట్టి రైతుకు పరిహారాన్ని ఇవ్వాల్సిఉంది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. హెక్టారుకు రూ.37,500 ఇన్సూరెన్స్ ఇచ్చేలా ప్రభుత్వం, బీమా కంపెనీ నిబంధనలు రూపొందించాయి. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతులకు అందించాలి. తొలివిడతలో జూలై 16 నుంచి ఆగస్టు 5వరకూ నమోదైన వర్షపాతం వివరాలు తీసుకోవాలి. పదిరోజుల్లో పరిహారంపై బులిటెన్ విడుదల చేసి.. ఆపై వారంలోపు రైతుల ఖాతాలో మొదటి విడత పరిహారాన్ని జమ చేయాలి. రెండో విడత ఆగస్టు 6 నుంచి 31వరకూ లెక్కగట్టాలి. బులిటెన్, పరిహారం మొదటి విడతలాగే చేయాలి. చివరి విడతలో సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 10 వరకూ వర్షపాతాన్ని లెక్కగట్టాలి. రెండు విడతల్లో పోనూ తక్కిన పరిహారాన్ని ఇవ్వాలి. అంటే ఆర్నెల్ల కిందటే రైతులకు పూర్తిస్థాయి పరిహారం అందాలి. అయితే ఇప్పటి వరకూ చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు.
ఏటా అన్యాయమే
2015లో జిల్లా రైతులు రూ.115.60 కోట్ల ప్రీమియాన్ని చెల్లించారు. ఇది కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.వంద కోట్ల ప్రీమియం చెల్లించాయి. మొత్తంగా దాదాపు రూ.220 కోట్లు బీమా కంపెనీకి ప్రీమియం రూపంలో దక్కింది. కానీ రైతులకు ఇచ్చిన పరిహారం రూ.109 కోట్లు మాత్రమే. అంటే ప్రీమియంలో 50శాతం కూడా చెల్లించలేదు. వర్షపాతం నమోదులో కచ్చితత్వాన్ని పాటించకపోవడంతోనే తక్కువగా పరిహారం వచ్చిందనే విమర్శలున్నాయి. వర్షపాతం వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని రెవెన్యూ గ్రామాల్లో 141 పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి ఎక్కడా పనిచేయడం లేదు. ఈ ఏడాది రూ.367 కోట్ల బీమా మంజూరైనట్లు చెబుతున్నారు.
ఏ లెక్కలను ఆధారంగా చేసుకుని ప్రకటించారనేది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. నిజానికి గడిచిన ఖరీఫ్‌లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. 10శాతం ప్రీమియంలో 2శాతం రైతుల వాటాగా రూ.56 కోట్లు చెల్లించారు. తక్కిన 8శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. ఈ లెక్కన ప్రీమియం రూపంలో రూ.280కోట్లు బీమా కంపెనీకి దక్కింది. కంపెనీ ఇస్తున్న పరిహారం మాత్రం రూ.367 కోట్లు. అంటే ప్రీమియం కంటే రూ.87కోట్లు మాత్రమే అదనంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సొమ్ము కూడా గతేడాది ఆగస్టు–అక్టోబరు మధ్యే చెల్లించాలి. ఇప్పటికీ అతీగతీ లేదు. ప్రీమియం మొత్తానికి ఈ ఆర్నెల్ల వడ్డీ లెక్కిస్తే బీమా కంపెనీకి ఒక్క రూపాయి కూడా భారం పడే పరిస్థితి లేదు.
ప్రజాప్రతినిధుల ఉదాసీనత
రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. బీమా సొమ్ము దక్కలేదు. ఆర్థిక ఆసరా లేక, బతుకు కష్టమై వలసబాట పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. జూన్, జూలైలో సాగుచేసిన పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి గ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది. ఈ క్రమంలో అండగా నిలవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా సరైన నివేదికలను ప్రభుత్వానికి పంపడం లేదు.