breaking news
not give
-
బీమా కరువు!
కనికరించని ప్రభుత్వం - బీమా ప్రీమియం చెల్లింపునకు ముగిసిన గడువు - ఇప్పటి వరకు పొడిగింపునకు ససేమిరా - జిల్లాలో 50వేల మంది రైతుల నిరీక్షణ - చిన్న, సన్నకారు రైతులే అధికం - నోరు మెదపని అధికార పార్టీ నేతలు 5.50 లక్షలు : జిల్లాలో వేరుశనగ రైతులు రూ.4,246 కోట్లు : పంట రుణాల రెన్యూవల్స్ లక్ష్యం రూ.3,800 కోట్లు : పూర్తయిన రెన్యూవల్స్ 4.60 లక్షలు : వాతావరణ బీమా పరిధిలోని రైతులు 50వేలు : బీమా కోల్పోతున్న రైతులు జూలై 15 : ముగిసిన రెన్యూవల్స్ గడువు అనంతపురం అగ్రికల్చర్: పంట రుణాల రెన్యూవల్స్ ముందస్తుగానే ప్రారంభించినా ఫలితం లేకుండా పోతోంది. వాతావరణ బీమా పథకం వర్తింపునకు జూలై 15 ఆఖరు కావడంతో.. సుమారు 50వేల మంది రైతులు బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో మౌలిక వసతులు లేకపోవడం.. సిబ్బంది కొరత.. సర్వర్‌తో సాంకేతిక సమస్యలు.. నగదు కొరత.. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీతో పాటు సరైన ప్రణాళిక లేకపోవడంతో రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ మందగించింది. ఈ ఖరీఫ్‌లో అన్ని బ్యాంకుల ద్వారా రూ.4,245 కోట్ల పంట రుణాలు రెన్యూవల్ చేయాలనేది బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యం. పంట రుణ పరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఆధారంగా రైతుల వాటా 2 శాతం ప్రీమియం చెల్లిస్తే.. మిగతా 8 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కంపెనీకి ప్రీమియం జమ చేస్తాయి. 2 శాతమే అయినా.. జిల్లా రైతులపై రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు భారం పడుతుంది. మే మొదటి వారం నుంచి రెన్యూవల్స్ ప్రారంభం కావడంతో గడువులోగా ముగిసే అవకాశం ఉంటుందని భావించారు. అయితే వివిధ కారణాలతో కటాఫ్ తేదీ జూలై 15 నాటికి రూ.3,800 కోట్ల రెన్యూవల్స్ పూర్తి కాగా.. 4.60 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. చివరి రోజు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో రెన్యూవల్స్ తక్కువయ్యాయి. ఇప్పటికీ వేలాది మంది రైతులు రెన్యూవల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీలే ఉండటం గమనార్హం. గతేడాది 5.10 లక్షల మంది రెన్యూవల్స్ గతేడాది జూలై 15 నాటికి 5.10 లక్షల మంది రైతులు రెన్యూవల్స్ చేయించుకోవడంతో బీమా పరిధిలోకి రావడంతో.. 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల వాతావరణ బీమా కింద పరిహారం విడుదలయింది. రేపోమాపో రైతుల ఖాతాల్లోకి బీమా పరిహారం జమ చేయనున్నట్లు లీడ్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి ఎంతలేదన్నా 50వేల మంది రైతులకు వాతావరణ బీమా పథకం వర్తించే పరిస్థితి లేదు. ఆందోళనలు చేసినా.. వర్షాలు లేకపోవడం, పంటల సాగు పడకేయడం, బ్యాంకుల్లో నెలకొన్న సమస్యల కారణంగా ఈ సారి ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించే అవకాశం ఉంటుందని ఊహించారు. ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించాలని, కనీసం జూలై నెలాఖరు వరకైన సమయం ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పొడిగించాలంటూ కలెక్టర్, జేడీఏ, ఎల్డీఎం కార్యాలయాల నుంచి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ), బీమా పథకం అమలు చేస్తున్న హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి సీఎంపై ఒత్తిడి తీసుకురావాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అవకాశం లేనట్లే.. గడువు పొడిగించాలని కోరినా.. ఇప్పటికి అవకాశం కనిపించట్లేదు. జూలై 15 వరకు నిర్వహించిన రెనూవల్స్, ప్రీమియం, ఎన్ని హెక్టార్లు, ఎంత మంది రైతులు అనే వివరాలు అప్లోడ్ చేసి ఈ నెలాఖరు లోగా పంపాలనే ఆదేశాలు ఉండటంతో ఆ పనిలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రీమియం చెల్లింపు గడువు పొడిగిస్తారా లేదా అనేది సందేహమే. నాలుగైదు బ్యాంకులు మినహా మిగతా వాటిలో 15 నుంచి 20 శాతం మంది రైతులు బీమా పరిధిలోకి రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన వివరాలు అందాల్సి ఉంది. - ఎల్.జయశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
అడిగేవారేరీ?!
– ఇప్పటికీ అందని వాతావరణ బీమా – బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు – నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న ఇన్సూరెన్స్ కంపెనీ (సాక్షిప్రతినిధి, అనంతపురం) రైతులకు హక్కుగా దక్కాల్సిన వాతావరణ బీమా పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్స్ కంపెనీ అలసత్వం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి గతేడాది అక్టోబరు 10లోపే పూర్తిగా పరిహారాన్ని చెల్లించాలి. అయితే.. నేటికీ చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా దక్కడంలో ఇబ్బందులు ఎదురైతే అండగా ఉండి, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. వెరసి ‘అనంత’ రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. వాతావరణ ఆధారిత పంటల బీమాకు వేరుశనగ రైతులు గతేడాది ఖరీఫ్‌లో ప్రీమియం చెల్లించారు. పంట దిగుబడితో పనిలేకుండా జిల్లా సగటు వర్షపాతం, నమోదైన వర్షపాతం, వాతావరణ పరిస్థితులను లెక్కగట్టి రైతుకు పరిహారాన్ని ఇవ్వాల్సిఉంది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. హెక్టారుకు రూ.37,500 ఇన్సూరెన్స్ ఇచ్చేలా ప్రభుత్వం, బీమా కంపెనీ నిబంధనలు రూపొందించాయి. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతులకు అందించాలి. తొలివిడతలో జూలై 16 నుంచి ఆగస్టు 5వరకూ నమోదైన వర్షపాతం వివరాలు తీసుకోవాలి. పదిరోజుల్లో పరిహారంపై బులిటెన్ విడుదల చేసి.. ఆపై వారంలోపు రైతుల ఖాతాలో మొదటి విడత పరిహారాన్ని జమ చేయాలి. రెండో విడత ఆగస్టు 6 నుంచి 31వరకూ లెక్కగట్టాలి. బులిటెన్, పరిహారం మొదటి విడతలాగే చేయాలి. చివరి విడతలో సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 10 వరకూ వర్షపాతాన్ని లెక్కగట్టాలి. రెండు విడతల్లో పోనూ తక్కిన పరిహారాన్ని ఇవ్వాలి. అంటే ఆర్నెల్ల కిందటే రైతులకు పూర్తిస్థాయి పరిహారం అందాలి. అయితే ఇప్పటి వరకూ చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ఏటా అన్యాయమే 2015లో జిల్లా రైతులు రూ.115.60 కోట్ల ప్రీమియాన్ని చెల్లించారు. ఇది కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.వంద కోట్ల ప్రీమియం చెల్లించాయి. మొత్తంగా దాదాపు రూ.220 కోట్లు బీమా కంపెనీకి ప్రీమియం రూపంలో దక్కింది. కానీ రైతులకు ఇచ్చిన పరిహారం రూ.109 కోట్లు మాత్రమే. అంటే ప్రీమియంలో 50శాతం కూడా చెల్లించలేదు. వర్షపాతం నమోదులో కచ్చితత్వాన్ని పాటించకపోవడంతోనే తక్కువగా పరిహారం వచ్చిందనే విమర్శలున్నాయి. వర్షపాతం వివరాలు తెలుసుకునేందుకు జిల్లాలోని రెవెన్యూ గ్రామాల్లో 141 పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి ఎక్కడా పనిచేయడం లేదు. ఈ ఏడాది రూ.367 కోట్ల బీమా మంజూరైనట్లు చెబుతున్నారు. ఏ లెక్కలను ఆధారంగా చేసుకుని ప్రకటించారనేది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. నిజానికి గడిచిన ఖరీఫ్‌లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. 10శాతం ప్రీమియంలో 2శాతం రైతుల వాటాగా రూ.56 కోట్లు చెల్లించారు. తక్కిన 8శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. ఈ లెక్కన ప్రీమియం రూపంలో రూ.280కోట్లు బీమా కంపెనీకి దక్కింది. కంపెనీ ఇస్తున్న పరిహారం మాత్రం రూ.367 కోట్లు. అంటే ప్రీమియం కంటే రూ.87కోట్లు మాత్రమే అదనంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సొమ్ము కూడా గతేడాది ఆగస్టు–అక్టోబరు మధ్యే చెల్లించాలి. ఇప్పటికీ అతీగతీ లేదు. ప్రీమియం మొత్తానికి ఈ ఆర్నెల్ల వడ్డీ లెక్కిస్తే బీమా కంపెనీకి ఒక్క రూపాయి కూడా భారం పడే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధుల ఉదాసీనత రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. బీమా సొమ్ము దక్కలేదు. ఆర్థిక ఆసరా లేక, బతుకు కష్టమై వలసబాట పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. జూన్, జూలైలో సాగుచేసిన పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి గ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది. ఈ క్రమంలో అండగా నిలవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా సరైన నివేదికలను ప్రభుత్వానికి పంపడం లేదు.