విధుల్లో చేరని అధ్యాపకులు | Included faculty duties | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరని అధ్యాపకులు

Jan 13 2017 11:19 PM | Updated on Sep 5 2017 1:11 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తరగతులు బోధిస్తున్న కాంట్రాక్టు అ«ధ్యాపకులు గురువారం విధుల్లో చేరలేదు.

అందని షోకాజు నోటీసులు
పరీక్ష ఏర్పాట్లలో ఇంటర్‌ బోర్డు


మంచిర్యాల సిటీ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తరగతులు బోధిస్తున్న కాంట్రాక్టు అ«ధ్యాపకులు గురువారం విధుల్లో చేరలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెలోకి వెళ్లిన అధ్యాపకులంతా ఈ నెల 12న తప్పనిసరిగా విధుల్లో చేరాలంటూ ఇంటర్మీడియెట్‌ బోర్డు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో చేరని వారిని   ఇంటికి పంపుతామని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయినా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఏ ఒక్క అధ్యాపకుడు కూడా విధులకు హాజరు కాలేదు. ఇప్పటి వరకు షోకాజు నోటీసులు కూడా అందలేదని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రవీంద్రకుమార్‌ స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల్లోని 46 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 478 మంది అధ్యాపకులు కాంట్రాక్టు ప్రాతిపదికన తరగతులు బోధిస్తున్నారు. బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా గురువారం నుంచి అధ్యాపకులు నాలుగు జిల్లాల్లోనూ నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయడానికే ముందుకు సాగుతున్నారు.

పరీక్ష ఏర్పాట్లు..
ఇదిలా ఉంటే.. ఇంటర్మీడియెట్‌ 2017 ప్రాక్టికల్, థియరీ పరీక్షల ఏర్పాట్లలో బోర్డు నిమగ్నమైంది. కాంట్రాక్టు అధ్యాపకులు దీర్ఘకాలిక సమ్మెలోకి వెళ్లడంతో బోర్డు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 25న పరీక్ష ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నెల 28 నుంచి 30 వరకు పర్యావరణ పరిరక్షణ, నైతిక విలువలు పరీక్ష నిర్వహణకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 3 నుంచి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు పదవీ విరమణ చేసిన వారితోపాటు కళాశాల సమీపంలో ఉన్న అర్హులైన నిరుద్యోగులను, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను నియమించుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ అవసరమైతే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లను కూడా సద్వినియోగం చేసుకోవాలని బోర్డు ఆలోచిస్తోంది. అదే విధంగా మార్చి ఒకటి నుంచి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు ప్రస్తుతం ఉన్న పర్మినెంటు అధ్యాపకులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను నియమించుకోడానికి బోర్డు అధికారులు ఈనెల 25న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మెను ముందు దృష్టితో చూసిన బోర్డు అధికారులు అదే చూపుతో ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

25 రోజులు దాటితే..
కాంట్రాక్టు అధ్యాపకులు దీర్ఘకాలికంగా 25 రోజుల సమ్మెలో ఉంటే వారు ఇంటికి వెళ్లాల్సిందే. వారు డిసెంబర్‌ 28 నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. సంక్రాంతి సెలవులు ఈనెల 16 వరకు ఉన్నాయి. సెలవుల్లోపు వారంతా విధుల్లోకి వెళ్తే కొలువు ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదు రోజులు సమ్మెలోకి వెళ్తే 25 రోజలు సమ్మెలో ఉన్నట్టే. దీంతో నిబంధనల మేరకు దీర్ఘకాలిక సమ్మెలో 25 రోజలు ఉన్నవారు విధులకు దూరంగా ఉండాల్సిందేనంటూ బోర్డు అధికారులు ఆదేశాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం షోకాజు నోటీసులు ఇవ్వకుండా బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement