
ఏలూరులో కాల్పుల కలకలం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఏలూరు వన్టౌన్ లోని వైఎంహెచ్ఏ వద్ద కురపాటి నాగరాజు అనే వ్యక్తిపై మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలం నుంచి నాగరాజు అజ్ఞాతంలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
పెదవేగి మండలం పినకమిడిలో మూడేళ్ల క్రితం జరిగిన బుతం దుర్గారావు హత్యకేసులో నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 2014లో కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో నాగరాజుకు చెందిన అనుచరులను దుర్గారావు అనుచరులు దారుణంగా హత్యచేశారు. గతేడాది హైదరాబాద్ లోని సరూర్నగర్ లో నాగరాజుపై హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రత్యర్థుల భయంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. తాజాగా ఏలూరు టౌన్లో నాగరాజుపై కొందరు దుండగులు మంగళవారం రాత్రి దాదాపు తొమ్మిదిన్నర గంటల సమయంలో మరోసారి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. నాగరాజుపై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షలతోనే నాగరాజుపై కాల్పులు జరిపి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.