వాన దంచికొట్టింది. వరద ఉరకలెత్తింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..వరదతో పోటెత్తాయి. కిన్నెరసాని గలగలాపారుతూ హొయలు పోయింది. గరిష్ట నీటిమట్టానికి చేరి నిండుకుండలా మారింది. వైరా జలాశయం కొత్త నీటితో కళకళలాడింది.ఽ
-
ఉప్పొంగిన వాగులు..
-
జలకళ నింపుకున్న చెరువులు
వాన దంచికొట్టింది. వరద ఉరకలెత్తింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..వరదతో పోటెత్తాయి. కిన్నెరసాని గలగలాపారుతూ హొయలు పోయింది. గరిష్ట నీటిమట్టానికి చేరి నిండుకుండలా మారింది. వైరా జలాశయం కొత్త నీటితో కళకళలాడింది.ఽ గూడెం వద్ద ముర్రేడు వాగు ఉప్పొంగుతూ..ఉధృతంగా సాగింది. మున్నేరు వరదతో పోటెత్తింది. పాఖాల వాగు, బయ్యారం పెద్ద చెరువు, ఆకేరు జలహోరు తోడవడంతో ఉరకలెత్తింది. తాలిపేరు గేట్ల నుంచి జలధార ఎగసి పడింది. అటు ఏజెన్సీ..ఇటు మైదాన ప్రాంతాలన్నీ తడిసిముద్దయ్యాయి. ఎడతెరపి లేని వాన..తోడైన వరదతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినా..పంటలకు, సాగుకు భరోసా లభించిందని రైతులు పరవశించారు.
ఖమ్మం గాంధీచౌక్: మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం పాఖాల వాగు, బయ్యారం పెద్ద చెరువు నుంచి అలిగేరు, ఆకేరు వాగుల నీరు మున్నేరులో కలుస్తుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రం ఖమ్మం వద్ద వరదను నగర ప్రజలు తరలొచ్చి తిలకించారు.కాల్వొడ్డు, ట్రంక్ రోడ్, సారధీనగర్, రాపర్తినగర్ ప్రాంత ప్రజలు సమీపంలోని మూడు వంతెనలపై నుంచి వరద ఉధృతిని తిలకించారు.