టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు | Four MLAs joined in the TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

Feb 23 2016 1:35 AM | Updated on Oct 30 2018 4:15 PM

వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి

సాక్షి, తాడేపల్లి (గుంటూరు): వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల  ప్రియ, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, జమ్మలమడుగు ఎమ్మెల్యేల దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సోమవారం రాత్రి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ వేదికగా మధ్యాహ్నం నుంచి జరిగిన హై డ్రామా చివరకు సీఎం  చంద్రబాబు అధికారిక నివాసానికి మారింది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఒక్కొక్కరితో విడివిడిగా జరిపిన చర్చల అనంతరం 11 గంటల తర్వాత చంద్రబాబు వీరికి పార్టీ కండువాలు కప్పారు.

ఆరేడు నెలల కిందటే తాము టీడీపీలో చేరే విషయం ఖరారైనా ఇంత దాకా ఆలస్యం జరిగిందని ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకు ఉందనే నమ్మకం కార్యకర్తలు, ప్రజల్లో ఉన్నందువల్లే తాము టీడీపీ గూటికి వచ్చినట్లు వివరించారు. మాజీ శాసనసభ్యుడు రామసుబ్బారెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి భయంకరమైన ఫ్యాక్షన్ ఉన్నా దాన్ని మర్చి పోయి వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  రెండేళ్లుగా  చంద్రబాబే సీఎంగా ఉన్నా అభివృద్ధి జరగలేదంటే ఆయనే కారణం కదా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు.  

 సర్దుబాట్లు చేసుకుంటాం : భూమా
 రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజక వర్గాల్లో మా వాళ్లు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నారని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు తమ నియోజక వర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదనీ, కార్యకర్తలందరితో మాట్లాడి టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానన్నారు. పార్టీలో ప్రత్యర్థులనుకునే వారితో కూడా సర్దుబాట్లు చేసుకుంటామన్నారు.  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనే  టీడీపీలో చేరామని చెప్పారు.

 మా పనులు జరగడం లేదు : జలీల్ ఖాన్
 రెండేళ్లుగా తమ పనులు జరగడం లేదనీ, నియోజక వర్గంలో ముస్లింలు పేదలకు అన్యాయం జరుగుతోందనీ అందువల్లే టీడీపీలో చేరుతున్నానని విజయవాడ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement