
చినుకు రాలదు.. చేను తడవద
డక్కిలి మండలం నాగవోలు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు శివశంకర్.
⇒ జిల్లాలో తగ్గిన వర్షపాతం
⇒మబ్బులతో మురిపిస్తున్న వాతావరణం
⇒పూర్తికాని వరినాట్లు
⇒ ఆకాశం వైపు వేరుశనగ రైతుల చూపు
డక్కిలి మండలం నాగవోలు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు శివశంకర్. జూన్‌లో మోస్తరు వర్షాలు కురవడంతో తనకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారుమడి పోశాడు. ఆ తరువాత వరుణుడు మొహం చాటేయడం.. వర్షాభావ పరిస్థితుల వల్ల తన భూమిలోని బోరుబావిలో నీరు ఇంకిపోవడంతో ఇబ్బందులు పడ్డాడు. పొరుగు రైతుల బోరుబావుల నుంచి నీరు పెట్టుకుని ఎకరం విస్తీర్ణంలో నాట్లు పూర్తి చేశాడు. జూలై నెలలో అయినా వర్షాలు కురుస్తాయనుకుంటే మేఘాలు మురిపిస్తున్నాయే తప్ప చినుకులు రాలడం లేదు. ఎకరంలో వేసిన నాట్లు సక్రమంగా తడులు అందక ఎండిపోయే దుస్థితి తలెత్తింది. మిగిలిన రెండు ఎకరాల్లో నాట్ల కోసం పెంచిన నారుముదిరిపోతోంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసిన శివశంకర్ ఏం చేయాలో తెలియక వానదేవుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు. ఈ పరిస్థితి ఒక్క శివశంకర్‌కే పరిమితం కాదు. జిల్లాలోని చాలామంది రైతులు ఇదేవిధంగా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వెంకటగిరి : వరుణుడి కరుణ కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందుగానే వస్తాయని.. అల్పపీడనాల వల్ల వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు వరి నారుమడులు పోశారు. వేరుశనగ, ఇతర పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. జిల్లాలో జూన్ నెలలో 86.30 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 56.80 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జూలై 11వ తేదీ నాటికి 109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 66.30 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో వేరుశనగ సాగుచేసే రైతుల్లో చాలామంది చేలల్లో విత్తనాలు నాటలేదు. ఈ నెల ఆరంభం నుంచి వాతావరణంలో తేమ ఉంటున్నా ఆశిం చిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మెట్ట ప్రాంత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరినాట్లు వేసిన రైతులు, విత్తులు పూర్తి చేసిన ఇతర రైతులు ఇప్పటివరకు పెట్టిన వేలాది రూపాయల పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరులోగా వర్షాలు కురవకపోతే పంటలు చేతికందే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు.
వరి.. 16 వేల హెక్టార్లతో సరి
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 50,516 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటివరకూ 15,964 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. 8,177 హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా.. 6,634 హెక్టార్లలో మాత్ర మే విత్తులు వేశారు. పత్తి పంటను 4,666 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. 3,422 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. ఆరుతడి పంట అయిన మినుము సాగులో తిరోగమనం కనిపిస్తోంది. 4,131 హెక్టార్లలో మినుము వేయా లని లక్ష్యంగా నిర్ణయించగా. ఇప్పటివరకు కేవలం 12 హెక్టార్లలో మాత్రమే సాగు ఆరంభమైంది. జిల్లాలో ఎక్కడా ఒక్క ఎకరంలో కూడా కంది విత్తనాలు వేయలేదు.
ఆదుకోని జలాశయాలు
వర్షాభావ పరిస్థితులతోపాటు జలాశయాలు సైతం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. సోమశిల జలాశయంలో 7.41 టీఎంసీలు, కండలేరులో 4.652 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జూలైలో వర్షాలు మొహం చాటేస్తే ఈ జలాశయాల్లో నీరింకిపోయే ప్రమాదం ఉంది. నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి తాగునీటి అవసరాలకు తప్ప వీటినుంచి సాగునీటిని విడుదల చేసే అవకాశాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటపై రైతుల్లో నైరాశ్యం నెలకొంది.