మూసీనీటితో పంటలు సాగు చేయవద్దు
కేతేపల్లి : మూసీ కుడి, ఎడమ కాల్వలకు వదిలిన నీటితో ఆయకట్టులో రైతులు ఎలాంటి పంటల సాగు చేయవద్దని మూసీ డీఈ నవికాంత్ సూచించారు.
కేతేపల్లి : మూసీ కుడి, ఎడమ కాల్వలకు వదిలిన నీటితో ఆయకట్టులో రైతులు ఎలాంటి పంటల సాగు చేయవద్దని మూసీ డీఈ నవికాంత్ సూచించారు. ఆదివారం ఆయన మూసీ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. మూసీ రిజర్వాయర్‌లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు చేరిందన్నారు. తీవ్రమైన కరువు నెలకున్న నేపథ్యంలో ఆయకట్టు పరిధిలోని 42 చెరువులు, కుంటలు నింపేందుకు మాత్రమే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రసుత్తం కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. చెరువులు పూర్తిగా నిండేంత వరకు కాల్వలకు ప్రతిరోజు 250 క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కాల్వలకు విడుదల చేసిన నీటిని వినియోగించి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయవద్దని సూచించారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినట్లయితే ఆయకట్టులో రబీ పంటకు సాగునీరు విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు ఏఈ ఎన్.రమేష్ ఉన్నారు.