breaking news
musi water
-
Hyderabad: మూసీని చూసి మురుస్తున్న నగరవాసులు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్‌ఘాట్, మూసారాంభాగ్ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న సిటీజన్లు స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. మూసీ నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక సైతం స్పష్టం చేయడం గమనార్హం. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. జూలై చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం.. మోస్ట్ ప్రాపబుల్ నంబరు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తేలింది. కొంచెం ఊరట... తెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాలు, పలు నాలాల నుంచి మూసీలోకి వరద నీరు చేరుతుండడంతోనే మురుగు క్రమంగా వదులుతోంది. దీంతో వ్యర్థజలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పీసీబీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1800 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తున్న 22 ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణమని భావిస్తున్నారు. మూసీ మురిసేదెప్పుడో? వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేసి దాని ప్రకారం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు), పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీ) నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు చేపడితేనే మూసీ నది ఉత్తరాదిలోని గంగా, సబర్మతి నదుల తరహాలో మెరుస్తుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని స్పష్టం చేస్తున్నారు. చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’ -
మూసీనీటితో పంటలు సాగు చేయవద్దు
కేతేపల్లి : మూసీ కుడి, ఎడమ కాల్వలకు వదిలిన నీటితో ఆయకట్టులో రైతులు ఎలాంటి పంటల సాగు చేయవద్దని మూసీ డీఈ నవికాంత్ సూచించారు. ఆదివారం ఆయన మూసీ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. మూసీ రిజర్వాయర్‌లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు చేరిందన్నారు. తీవ్రమైన కరువు నెలకున్న నేపథ్యంలో ఆయకట్టు పరిధిలోని 42 చెరువులు, కుంటలు నింపేందుకు మాత్రమే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రసుత్తం కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. చెరువులు పూర్తిగా నిండేంత వరకు కాల్వలకు ప్రతిరోజు 250 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కాల్వలకు విడుదల చేసిన నీటిని వినియోగించి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయవద్దని సూచించారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినట్లయితే ఆయకట్టులో రబీ పంటకు సాగునీరు విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు ఏఈ ఎన్.రమేష్ ఉన్నారు.