ఇది మూసీనేనా..? స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్న జనం

Hyderabad Musi River Water Quality Slightly Improved - Sakshi

స్వల్పంగా మెరుగుపడిన మూసీ నీటి నాణ్యత 

జంట జలాశయాల గేట్లు వరుసగా తెరుస్తుండడంతో.. 

హానికారక బ్యాక్టీరియా ఉనికి తగ్గుముఖం 

కేంద్ర కాలుష్య నియంత్రణ మంలి నివేదికలో వెల్లడి 

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్‌–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్‌ఘాట్, మూసారాంభాగ్‌ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న సిటీజన్లు  స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. మూసీ నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక సైతం స్పష్టం చేయడం గమనార్హం. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్‌ ఆక్సీజన్‌ డిమాండ్‌ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. జూలై చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం.. మోస్ట్‌ ప్రాపబుల్‌ నంబరు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తేలింది. 

కొంచెం ఊరట... 
తెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాలు, పలు నాలాల నుంచి మూసీలోకి వరద నీరు చేరుతుండడంతోనే మురుగు క్రమంగా వదులుతోంది. దీంతో వ్యర్థజలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, పీసీబీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1800 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తున్న 22 ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణమని భావిస్తున్నారు.

మూసీ మురిసేదెప్పుడో? 
వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్‌ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్‌ప్లాన్‌ సిద్ధంచేసి దాని ప్రకారం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీలు), పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఈటీపీ) నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు చేపడితేనే మూసీ నది ఉత్తరాదిలోని గంగా, సబర్మతి నదుల తరహాలో మెరుస్తుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని స్పష్టం చేస్తున్నారు.
చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top