భైంసా ఏరియా ఆసుపత్రిలో వైద్యులంతా సేవలపై దృష్టి సారించాలని ముథోల్ ఎమ్మెల్యే, ఆసుపత్రి చైర్మన్ విఠల్‌రెడ్డి సూచించారు. సోమవారం భైంసాలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
-
ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
భైంసా: భైంసా ఏరియా ఆసుపత్రిలో వైద్యులంతా సేవలపై దృష్టి సారించాలని ముథోల్ ఎమ్మెల్యే, ఆసుపత్రి చైర్మన్ విఠల్‌రెడ్డి సూచించారు. సోమవారం భైంసాలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భైంసా ఏరియా ఆసుపత్రికి అధునాతన పరికరాలు వచ్చాయని తెలిపారు. భైంసా ఏరియా ఆసుపత్రికి వచ్చే వారిని పక్క ఆసుపత్రులకు పంపించడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇక్కడ చికిత్సలు అందించాలని తెలిపారు. పక్క ఆసుపత్రులకు తరలించడంతో నిరుపేదలు వైద్య సేవల కోసం తీవ్రంగా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు.
భైంసాలో ఏరియా ఆసుపత్రి ఉన్నప్పటికీ వారికి మెరుగైన సేవలు అందించలేకపోతున్నామన్నారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులంతా సమయపాలన పాటిస్తూ సేవలు విస్తరించాలని సూచించారు. తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఆసుపత్రికి పేరుతెచ్చిపెడుతూ నిరుపేదలకు వైద్యసేవలు అందించాలన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను నిర్లక్ష్యంచేయరాదన్నారు.
అధునాతన పరికరాలు...
అంతకు ముందు భైంసా ఏరియా ఆసుపత్రికి మంజూరైన అధునాతన పరికరాలను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి , భైంసా జెడ్పీటీసీ బోస్లే నీలాబాయి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కాశీనాథ్‌తో కలిసి ప్రారంభించారు.
రక్త పరీక్షల కోసం మంజూరైన మైక్రోస్కోప్, పల్స్ ఆక్స్‌మీటర్, ఆపరేషన్ థియేటర్‌లో టేబుల్, సిజరియన్ కిట్స్, డెలవరి కిట్స్, డిజిటల్ ఎక్స్‌రే తదితర వాటిని ప్రారంభించారు. ఇక నుంచి వీటిపైనే వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు సురేంధర్, విజయానంద్, అనీల్‌జాదవ్, శివప్రసాద్‌రెడ్డి, భాష, పద్మావతి, అజయ్‌రెడ్డితోపాటు స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.