
ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నిస్తున్నా?: ముద్రగడ
కాపులకు ఎంతో చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్లు అమలు కాకుండా ఎందుకు అడ్డుకున్నారని ముద్రగడ ప్రశ్నించారు.
తుని: కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వి. కొత్తూరు వద్ద నిర్వహిస్తున్న కాపు ఐక్య గర్జనలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సాధన కోసం కాపులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తమ ఉద్యమానికి ఇతర కులాలవారు కూడా మద్దతు తెలిపారని వెల్లడించారు. టీడీపీ నేతలు రాకపోయినా, కేడర్ వచ్చారని తెలిపారు. బ్రిటీష్ కాలంలో కాపు, బలిజ, తెలగ కులస్తులు రిజర్వేషన్లు అనుభవించారని గుర్తు చేశారు.
1993లో విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 30 నంబరు జీవో ఇచ్చారని, తర్వాత ఏడాది ఆయన ఓడిపోవడంతో ఈ జీవో అమలు కాలేదని వివరించారు. హైకోర్టులో పిటిషన్ వేయించి చంద్రబాబు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో జీవో 30 అమల్లోకి రాకుండా పోయిందన్నారు.
కాపులకు ఎంతో చేశామని చంద్రబాబు చెబుతున్నారని, కోర్టులో పిటిషన్ వేసి రిజర్వేషన్లు అమలు కాకుండా ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఏం చేశావని చంద్రబాబు తనను అడుగుతున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాలుపంచుకున్న చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ముద్రగడ ప్రశ్నించారు.