విశ్వ హృదయాలను బాబా గెలిచారు
‘ప్రేమ, శాంతి, నిస్వార్థ సేవా నిరతితో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాలను బాబా గెలిచారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ప్రేమ, శాంతి, నిస్వార్థ సేవా నిరతితో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాలను బాబా గెలిచారు. లక్షలాది మందికి ఉచితంగా విద్య, వైద్యం, తాగు నీరందించి సమాజానికి సేవచేసిన సత్యసాయి దీన జనుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. బాబా అనుసరించిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి’ అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగిన సత్యసాయి 90వ జయంతి వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ‘విద్యావాహిని ద్వారా అందరికీ విలువలతో కూడిన ఉచిత విద్య అందించారు. కరువుతో తల్లడిల్లుతున్న ‘అనంత’తో పాటు చెన్నై, ఇతర ప్రాంతాలకు మంచినీరు అందించారు.
లక్షలాది నిరుపేద రోగులకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. బాబా శివైక్యం తర్వాత వీటిని కొనసాగిస్తోన్న సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు అభినందనలు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ‘సత్యసాయి యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనే త్రిసూత్రాలను ప్రముఖంగా చెప్పేవారన్నారు. ‘కళ్లు మీవి.. చూపునాది, హృదయం మీది, ప్రేమ నాది, జీవితం మీది.. జీవి నాది, ప్రయత్నం మీది.. ఫలితం నాది. నేను ఎక్కడికీ వెళ్లలేదు. ప్రతిచోటా నేనున్నాను.’ అని బాబా ఇచ్చిన సందే శాన్ని గవర్నర్ గుర్తు చేశారు.
సేవాసంస్థల అధ్యక్షుడిగా నిమీశ్ పాండ్యా
సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షుడు శ్రీనివాసన్ ట్రస్టు 2014-15 వార్షిక నివేదికను వివరించారు. రూ.40 కోట్లతో ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు కొనుగోలు చేశామని, రూ.5 కోట్లతో జనరల్ ఆస్పత్రిని మరింత విస్తరించామన్నారు. అనంతపురం మహిళా కాలేజీలో ఎంబీఏ ప్రారంభించగా, పుట్టపర్తి క్యాంపస్‌లో ఎంసీఏను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. అఖిలభారత సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షుడిగా నిమీశ్ పాండ్యాను నియమిస్తూ ట్రస్టు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
హెలికాప్టర్‌తో పూల వర్షం
బాబా జయంతికి సుమారు వంద దేశాల నుంచి భక్తులు వచ్చారు. స్వర్ణరథంపై బాబా చిత్రపటాన్ని ఉంచి వైభవయాత్రగా స్టేడియంలోకి తీసుకొచ్చారు. బాబా చిత్ర పటానికి హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. స్టేడియంలో బాబా ఆసనం వద్దకు యాత్ర రాగానే వేదపండితులు హారతి పట్టేటపుడు సాయినామస్మరణ మార్మోగింది. వేడుకలో మంత్రి పల్లె ర ఘునాథరెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల, కలెక్టర్ కోన శశిధర్, డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్య, ట్రస్టు సభ్యులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి దాకా ఎలాంటి తప్పూ చేయలేదు
సత్యసాయి బాబా జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ఆసక్తికర అంశం చెప్పారు. తన వ్యక్తిగత జీవితంలో సత్యసాయి చూపిన ఆధ్యాత్మిక ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో ఐపీఎస్‌గా ఎన్నికైన తర్వాత ట్రైనీ ఏఎస్పీగా 45 ఏళ్ల కిందట అనంతపురం జిల్లాకు వచ్చానన్నారు. ‘రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పని ఒత్తిడితో బాబా దర్శనానికి రాలేకపోయా! కొంతకాలం తర్వాత బాబా పిలుపు మేరకు పుట్టపర్తికి వచ్చా. ఇంతలోనే గ్రీస్ రూంలోకి రావాలని నాకు పిలుపువచ్చింది. లోపలికి వెళ్లి కింద కూర్చోగానే ‘బంగారం.. నీవు జీవితంలో ఎప్పుడూ తప్పు చేయవు’ అని నన్ను ఆశీర్వదించారు. నాటి నుంచి నేటి వరకూ విధి నిర్వహణలో ఎలాంటి తప్పూ చేయకుండా ఉంటున్నా!’ అని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.


