ఆక్వాపార్క్‌తో జీవన ప్రమాణాలకు దెబ్బ | Sakshi
Sakshi News home page

ఆక్వాపార్క్‌తో జీవన ప్రమాణాలకు దెబ్బ

Published Sun, Mar 26 2017 12:33 AM

ఆక్వాపార్క్‌తో జీవన ప్రమాణాలకు దెబ్బ

 భీమవరం : గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యకారకంగా మార్చి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీసేలా తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ను నిర్మిస్తున్నారని న్యాయవాది, మానవహక్కుల వేదిక నాయకురాలు ఎం.విమల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సభ్యుడు బి.రామకృష్ణంరాజు అన్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్‌ బాధిత గ్రామాలైన తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు, మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లిలో శనివారం వీరు పర్యటించారు. బాధిత ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆక్వాపార్క్‌ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే అంశాలు,  కాలుష్యంపై జాతీయ మానవహక్కుల వేదిక, పర్యావరణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనున్నట్టు విమల చెప్పారు. మూడేళ్లుగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 40 గ్రామాలకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఫుడ్‌పార్క్‌ వల్ల ఎటువంటి కాలుష్యం బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పిన ప్రభుత్వం ఫ్యాక్టరీలోని కలుషిత నీటిని సముద్రంలో కలపడానికి రూ.12 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు మంజూరు చేసిందని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో రొయ్యలను శుద్ధిచేయడానికి రోజూ 1.15 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తారని, తర్వాత దీనిని బయటకు వదలడం ద్వారా భూగర్భ జలాలకు ముప్పుతప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1,200 మందికి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తూ లక్షల మంది భవిష్యత్‌ను విస్మరించడం దారుణమన్నారు. 
అనర్థాలు తప్పవు
ఆక్వా ఫుడ్‌పార్క్‌ వల్ల అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం అడ్డగోలుగా మద్దతు ఇవ్వడం దారుణమని కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో విచారణ చేయించి ఫ్యాక్టరీ నిర్మాణంపై ముందుకు సాగాలని సూచించారు. ప్రజా ఉద్యమాల జాతీయ కన్వీనర్‌ మీరా సంగమిత్ర మాట్లాడుతూ ఫుడ్‌పార్క్‌ నిర్మాణం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాక్టరీ వద్దంటున్న ప్రజలపై నిర్బంధాన్ని ఆపాలని, అక్రమ కేసులు  ఉపసంహరించుకోవాలని, 144 సెక్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. బృందంలో రోహిత్, రాహుల్‌ ఉన్నారు.  
 

Advertisement
Advertisement