ప్రియురాలి ఇంట్లో ప్రియుడి మృతి

తిరువొత్తియూరు: ప్రియురాలి ఇంట్లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీనిపై యువతిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై పల్లికరనై సమీపంలోని సిల్లుపాకం వళ్లువర్‌నగర్‌కు చెందిన కార్తీక్ (27) కారు డ్రైవర్. అతను ఊలందూరుపేటకు చెందిన రాజేశ్వరి (24)ని ఆరు నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఆమె పెరుంబాక్కం ఎళిల్‌నగర్‌లో ఉంటూ తరమణిలోని ఓ బ్యాంకులో పని చేస్తోంది.
ఒంటరిగా అద్దె ఇంటిలో ఉంటున్న రాజేశ్వరి ఇంటికి కార్తీక్ తరచూ వెళుతున్నట్లు తెలిసింది. ఆరు రోజుల క్రితం రాజేశ్వరి సొంత ఊరైన ఊలందూరుపేటకు వెళ్లి శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా కార్తీక్ విగత జీవిగా పడి ఉన్నాడు. అతని మృతదేహంపై చీమలు చుట్టుకుని ఉన్నాయి.
దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లికరనై పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కార్తీక్ కుడి పక్క నడుము భాగం, కుడి చేయి, కాలు భాగాల్లో గాయం ఉండటం గమనించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియురాలు రాజేశ్వరిని విచారణ చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి