తెల్లారితే పెళ్లి నిశ్చయం అంతలోనే విషాదం

Young Man Died In Road Accident Sangareddy - Sakshi

వర్గల్‌(గజ్వేల్‌): మృత్యువు దారికాచింది. బైక్‌ మీద వెళుతున్న యువకుడిపై పంజా విసిరింది. తెల్లారితే పెళ్లి నిశ్చయం వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఇంట విషాదం నింపింది. వర్గల్‌ మండలం నాచారం సమీపంలో బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనతో గజ్వేల్‌ మండలం మక్త మాసాన్‌పల్లిలో పెనువిషాదం అలుముకుంది. గౌరారం ఎస్సై ప్రసాద్, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మక్త మాసాన్‌పల్లికి చెందిన ఈసకంటి ఎల్లం (22) తాపీ మేస్త్రీ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో తనతోపాటు తమ్ముడు సురేష్‌ కూడా అన్న రామస్వామి సంరక్షణలోనే ఉంటున్నారు. మంగళవారం గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్‌ గెలుపు సంబరాల్లో తోటి మిత్రులతో కలిసి పాల్గొన్నాడు. ఆ తరువాత సాయంత్రం తన బైక్‌ మీద నాచారం వెళ్లాడు. మార్గమధ్యంలో నాచారం సిరి సీడ్స్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బైక్‌తో సహా ఎల్లం రోడ్డు కిందకు పడిపోయాడు.

దీంతో అతడిని ఎవరూ గమనించలేదు. ఉదయం ఆ మార్గంలో వెళుతున్న వ్యక్తులు గమనించారు. అతని వద్ద లభించిన ఫోన్‌ ద్వారా కుటుంబీకులకు సమాచారం చేరవేశారు. మృతుని సోదరుడు రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించినట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

నిశ్చితార్థం రోజునే..
అందరితో కలుపుగోలుగా ఉండే ఎల్లం(22)కు బుధవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మాట ముచ్చటకు వధువు సంబంధీకులు మక్తమాసాన్‌పల్లికి రావాల్సి ఉంది. ఇంతలోనే బైక్‌ అదుపుతప్పి యువకుడు ఎల్లం దుర్మరణం చెందడంతో ఆ ఇంట చావుబాజా మోగింది. కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎల్లం మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top