
గాయపడిన మహేందర్
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేయడమేగాక ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన మహేందర్, భరత్‌నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ యాదవ్ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఈ నెల 21న అఖిల్, సాయి అనే ఇద్దరు యువకులు మహేందర్‌ను బలవంతంగా కారులో వెంకటేష్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు.
మల్లేష్, సాయి, వెంకటేష్ అతడిని తీవ్రంగా కొట్టడంతో మహేందర్ సృహతప్పి పడిపోవడంతో 22వ తేదీ తెల్లవారుజామున యూసుఫ్‌గూడ రహదారిపై పడేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి బాలమణి కుమారుడిని కేర్ ఆసుపత్రిలో చేర్చించాడు. బుధవారం కోలుకున్న మహేందర్ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు పంపగా, వారు తమ పరిధి కాదంటూ జూబ్లీహిల్స్ కు పంపారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.