
అధికారులు స్వాధీనం చేసుకున్న కలప దుంగలు
కోటపల్లి(సిర్పూర్): ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలాన్ని అనుకొని ఉన్న ప్రాణహిత నది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కలప తరలిస్తుండగా ఆదివారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 106 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు దుండగులు ప్రాణహిత నదిలో తెప్పలపై కలప తీసుకొస్తున్నారని అందిన సమాచారం మేరకు చెన్నూర్ ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్‌ఆర్వో రవి, సిబ్బంది ప్రాణహిత నది తీరం వెంట గస్తీ కాశారు. కోటపల్లి మండలంలోని పుల్లగామ ప్రాణహిత రేవు వద్ద రాత్రి సమయంలో తెప్పలుగా వస్తున్న కలపను గమనించిన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో కలప స్మగ్లర్లు పరారు అయ్యారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రాణహిత నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పట్టుకున్న 106 టేకు దుంగలను తీసుకరావడం అధికారులకు తలనొప్పిగా మారింది. సిబ్బంది ప్రాణహిత సరిహద్దు తీరం వెంట ఉన్న అర్జునగుట్ట పుష్కరఘాట్ వద్దకు కలపను పడవలపై తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన కలపను భీమారం రేంజ్‌కు తరలించారు. కలప విలువ సుమారు 2లక్షల వరకు ఉంటుందని ఆధికారులు తెలిపారు. దాడిలో ఫారెస్ట్ సెక్షన్ అధికారులు శ్రీనివాస్, రాములు, రాందాస్, బీట్ అధికారులు సంతోష్, కోటపల్లి, నీల్వాయి బేస్ క్యాంప్ సిబ్బంది, స్రైకింగ్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.