కాళ్ల పారాణి ఆరకముందే.. | Women Suicide Kurnool | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే..

Jul 19 2018 7:09 AM | Updated on Jul 19 2018 7:09 AM

Women Suicide Kurnool - Sakshi

మృతి చెందిన జమీల

వారం రోజుల క్రితం బంధుమిత్రుల మధ్య ఆమె వివాహం ఘనంగా జరిగింది. తమ కుమార్తెకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం లాంఛనాలతో మెట్టినింటికి సాగనంపారు. అయితే తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో దిగాలు చెందింది. దీంతో భర్త విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సర్ది చెప్పారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులు, బంధువులను శోకసంద్రంలో ముంచింది. 

సాక్షి, గడివేముల: కర్నూలు జిల్లా మండలంలోని కరిమద్దెల గ్రామంలో బుధవారం ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..బండిఆత్మకూరు మండలం బి.కోడూరుకు చెందిన  ముల్లా చిన్నమౌలాలికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జమీల(19)కు కరిమద్దెల గ్రామానికి చెందిన ఉసేన్‌బాషాతో ఈ నెల 12న నిఖా జరిగింది. 13న వలిమా తర్వాత 14న పుట్టింటికి చేరుకుంది. తర్వాత ఈ నెల16 మెట్టినింటికి వచ్చింది. రెండు రోజులుగా ఆమె దిగాలుగా ఉండడంతో భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం తెలియజేశాడు.

దీంతో వారు తమ కుమార్తెకు నచ్చజెప్పారు. అయితే మధ్యాహ్నం  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త చుట్టుపక్కల వారితో కలిసి తలుపును ధ్వంసం చేసి ఉరికి వేలాడుతున్న ఆమెను కిందికి దించాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుడిని పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement