‘మేం కూటికి పేదవాళ్లమే.. గుణానికి కాదు’

Women Suicide Commit Khammam - Sakshi

ఆమె నిరుపేద. ఆ పెద్దాయన ఇంటిలో పని మనిషిగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఇన్నేళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్న ఆమెపై ఆ ఇంటి పెద్దోళ్లు అభాండం వేశారు. దీనిని ఆమె అవమానంగా భావించింది... భరించలేకపోయింది... బలవంతంగా తన ప్రాణాలను తానే బలి తీసుకుంది. ఆ అభిమానవతి, అభాగ్యురాలు... మద్దికుంట భార్గవి. అభియోగం మోపిన ఆ పెద్దోళ్లు...పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులు..

ఖమ్మంక్రైం: తనకు దొంగతనం అంటగట్టడాన్ని భరించలేని ఓ నిరుపేద ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... నగరంలోని శ్రీనివాస్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఆమె పేరు మద్దికుంట భార్గవి(35). ఆమెకు భర్త బాలరాజు (మార్కెట్‌లో హమాలీ), పిల్లలు మౌనిక, సంతోష్‌ ఉన్నారు. ఆమె గత 15 సంవత్సరాలుగా జమలాపురం కేశవరావు పార్క్‌ సమీపంలోగల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు పులిపాటి ప్రసాద్‌ ఇంట్లో పనిచేస్తోంది. ఆమెది రెక్కాడితేకాని డొక్కాడని కటుంబం. కుటుంబం గడవటానికి పూలు కూడా కట్టేది. తమ ఇంట్లో భార్గవి దొంగతనం చేసిందంటూ కొన్ని రోజుల క్రితం పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులు అభాండం వేశారు.

తనకు ఏ పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆమె ఎంతగా నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా వారు వినలేదు. ఇన్నేళ్లపాటు ఎంతో నమ్మకంగా పనిచేసిన తనపై ఇంతటి అభాండం మోపారంటూ భర్తతో చెప్పి ఏడ్చింది. తనకు రావాల్సిన జీతం డబ్బులు 6000 రూపాయలు తీసుకునేందుకని యజమాని ఇంటికి శుక్రవారం వెళ్లింది. అక్కడ ఆమెను పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులు తీవ్రంగా దూషించారు. అనరాని మాటలు అన్నారు. జీతం డబ్బులు ఇవ్వకుండా వెళ్లగొట్టారు. ‘‘మేం కూటికి పేదవాళ్లమే. గుణానికి మాత్రం కాదు’’ అని, చెబ్బబోయినా వినలేదు. అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేకపోయింది. ఆమెకు గుండె పగిలినట్టయింది. ఇంటికి వచ్చింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. కూతురు మౌనిక.. కళాశాలలో, కుమారుడు సంతోష్‌.. పాఠశాలలో, భర్త బాలరాజు.. మార్కెట్‌లో ఉన్నారు. ఆమె అత్త బాలామణి కూడా ఊరికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన భర్త బాలరాజు... ఉరికి వేలాడుతున్న భార్యను చూసి షాకయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. ఆమెను కిందక దించారు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వచ్చారు. భార్గవి ఆత్మహత్యపై ఆమెతో పనిచేయించుకుని, అభాండాలు వేసినట్టుగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంటి యజమాని పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘మేము భార్గవిని వేధించలేదు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు’’ అన్నారు. త్రీ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top