ప్రేమించానని.. పెళ్లాడి.. మోసగించాడు

Women Protest For Justice  - Sakshi

ఖమ్మంఅర్బన్‌ : ప్రేమించానంటూ వెంటబడ్డాడు. మాయమాటలు చెప్పాడు. చివరికి పెళ్లాడాడు. మూడు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడు వెళ్లిపొమ్మంటున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె, న్యాయం కోసం అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె తెలిపిన వివరాలు... నగరంలోని పాండురంగాపురం ప్రాంతానికి చెందిన బాలాజీ,  హైదరాబాద్‌లోని నాచారం  విద్యుత్‌ శాఖలో ప్రయివేటు ఉద్యోగిగా (మీటర్‌ రీడింగ్‌ ఆపరేటర్‌గా) పనిచేస్తున్నాడు.

నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(22)తో అతడికి పరిచయమేర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కొన్ని రోజులపాటు స్వాతి నిరాకరించింది. ఆ తరువాత అతడి మాయమాటలు నమ్మింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో, గత ఏడాది అక్టోబర్‌ 2న జడ్చర్లలోని ఆర్య సమాజ్‌లో బాలాజీ–స్వాతి పెళ్లి చేసుకున్నారు  పాండురంగాపురంలోని తన ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాడు.

మూడు నెలల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి భర్త, అత్త, మామ, మరిది వేధింపులు మొదలయ్యాయి. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. పైసా కట్నం రాలేదని, పైగా కులాంతర వివాహమని ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఐదు నెలలపాటు ఇవన్నీ భరించింది. ‘‘బాలాజీకి మరో పెళ్లి చేస్తాం. నువ్వు ఒప్పుకోవాలి’’ అంటూ వేధించసాగారు.

ఆమె భరించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వాతిని, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు ఆమె తల్లి తీసుకెళ్లింది. అక్కడ ఆమె ప్రస్తుతం కోలుకుంది. ఆదివారం  పాండురంగాపురం వచ్చింది. ఆమెను అత్త, మామ కలిసి బలవంతంగా ఇంటి బయటకు గెంటేశారు. ఇంటికి, గేటుకు తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. 

స్వాతి, సోమవారం ఉదయం నుంచి తన భర్త ఇంటి గేటు ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, తన భర్తతో కాపురం సజావుగా సాగేలా చూడాలని కోరుకుంటోంది. ఆమెకు మహిళాసంఘాలు బాసటగా నిలిచాయి. స్వాతి భర్త బాలాజీని, అతడి కుటుంబీకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఐ నాగేంద్రాచారి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top