ఠాణా ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Woman attempts suicide in front of Thana - Sakshi

వెండి పట్టాలు పోయాయని నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు

అదే విషయమై మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు

పోలీసులు బెదిరించి వెళ్లగొట్టడంతో మనస్తాపం చెంది ఒంటికి నిప్పు

మొయినాబాద్‌ (చేవెళ్ల): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఠాణా ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వెండి పట్టాలు పోయాయని తాను ఇచ్చిన ఫిర్యాదు విషయం తెలుసుకునేందుకు బుధవారం స్టేషన్‌కు వెళ్లిన ఆమెను పోలీసులు బెదిరించి వెళ్లగొట్టడంతో మనస్తాపంతో ఒంటికి నిప్పంటించుకుంది. మొయినాబాద్‌ మండల పరిధిలోని ముర్తూజగూడలో నివాసముంటున్న సంపంగి బాల్‌రాజ్, సుగుణ(32) దంపతులు వడ్డెర పని చేసి జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సుగుణకు చెందిన 20 తులాల వెండి పట్టాలు ఇంట్లోంచి పోయాయి.

ఈ విషయమై ఆమె అదే రోజు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. తన తండ్రి రెండో భార్య ఎల్లమ్మపై అనుమానం ఉందని పేర్కొంది. పోలీసులు ఎల్లమ్మను పిలిపించి విచారించగా తాను పట్టాలు తీయలేదని చెప్పింది. అయితే, ఈ విషయంలో సుగుణ, ఎల్లమ్మ గొడవపడ్డారు. గొడవలు వద్దని, చోరీపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పి ఇద్దరినీ పంపించారు. కాగా బుధవారం కేసు విషయం ఎంత వరకు వచ్చిం దని తెలుసుకునేందుకు సుగుణ ఠాణాకు వెళ్లిం ది. పోలీసులు ఆమెను లోపలికి రానివ్వకుండా బెదిరించి బయటి నుంచే వెళ్లగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బయటకొచ్చి ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు, పోలీసులు మం టలను ఆర్పారు. తీవ్ర గాయాలైన సుగుణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.  

తల్లి వెంటే ముగ్గురు పిల్లలు... 
కేసు విషయం తెలుసుకునేందుకు ఠాణాకు వచ్చిన సుగుణ తన ఇద్దరు కొడుకులు, ఓ కూతురును తీసుకొచ్చింది. పిల్లల ముందే ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో వారు పెద్దగా కేకలు పెడుతూ రోదించారు. అనం తరం తల్లిని ఆస్పత్రికి తరలించడంతో పిల్లలు  పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం స్థానికులను కలిచివేచింది.  

డీజిల్‌ ఎక్కడిది..?  
సుగుణ డీజిల్‌ ఎక్కడి నుంచి తెచ్చుకుందనే విష యం అంతు చిక్కడం లేదు. పోలీసులు బెదిరిం చిన తర్వాత బయటకు వెళ్లిన ఆమె డీజిల్‌ తెచ్చు కుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుందా...? లేక ముందుగానే తనతో డీజిల్‌ తెచ్చుకుందా.. అనే విషయం తెలియడం లేదు. ఈ విషయమై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. ఠాణా ఎదుటున్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

విచారణ చేస్తున్నామని చెప్పాం.. 
వెండి పట్టాలు పోయాయని నాలుగు రోజుల క్రితం సుగుణ ఫిర్యాదు ఇచ్చింది. సవతి తల్లి ఎల్లమ్మపై అనుమానం ఉందని చెప్పడంతో ఆమెనూ విచారిం చాం. బుధవారం సుగుణ మళ్లీ ఠాణాకు వచ్చింది. కేసు విచారణ జరుపుతున్నామని చెప్పి పంపించాం. బయటకు వెళ్లిన కొంతసేపటికి ఠాణా పక్కన తహసీల్దార్‌ కార్యాలయం గేటు సమీపంలో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించాం.  
– జానయ్య,మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top