ప్రాణం తీసిన బిందె

Water Problem Leads To Women Death In Sompeta - Sakshi

సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : తాగునీటి కోసం మహిళల మధ్య తలెత్తితున్న చిన్నపాటి ఘర్షణలతో ప్రాణాలు పోతున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పట్టణంలోని పల్లివీధిలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన గొడవ ఓ మహిళా ప్రాణం తీసేందుకు కారణమైంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ కే వెంకటేశ్‌ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 6–30 గంటల సమయంలో ఉద్దానం రక్షిత పథకం నుంచి తాగునీరు సరఫరా అయ్యింది.

రోజూ నీటి సరఫరా సమయంలో లైన్లో బిందెలు పెట్టుకోవడం వీధివారికి  ఆనవాయితీ. ఈ సమయంలో తాతపూడి పద్మ(36), ఈమె తల్లి తెప్పల ఈశ్వరమ్మల కంటే వెనుక వచ్చిన అదేవీధికి చెందిన తెప్పల సుందరమ్మ బిందెలు పెట్టడంతో చిన్నపాటి ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత సుందరమ్మ కుళాయి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది. వారిద్దరూ ఎన్నో మాటలు అంటున్నారని కుళాయి దగ్గర ఉన్న మరో మహిళ గున్నమ్మ సుందరమ్మకు చెప్పింది.

వెంటనే సుందరమ్మ అక్కడకు వచ్చి గొడవ పడింది. ఖాళీ బిందెతో దాడి చేసి, పద్మను జుత్తు పట్టి లాగడంతో కింద పడి పోయింది. దీంతో ఎడమ చెంపపై బయటకు కనిపించని తీవ్ర గాయం కావడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వీధివాసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు పద్మ, సుందరమ్మ కుటుంబీకులు దగ్గర బంధువులు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి మృతదేహం వద్ద కుమార్తె రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీళ్లు తెప్పించింది. పద్మ భర్త ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్‌ఐ 304/2 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top