ఆధిపత్యం కోసమే హత్య

Visakha Police Reveals Rowdy Sheeter Khasim Murder Case - Sakshi

ఖాసీం హత్య కేసును ఛేదించిన పోలీసులు

రిమాండ్‌కు ఏడుగురు సభ్యుల చిట్టిమామూ గ్యాంగ్‌

పిస్ట్టల్, ఆరు కత్తులు, ఆటో, స్టీల్‌రాడ్, కారంపొడి స్వాధీనం

కేసు దర్యాప్తు చేసిన    పోలీసులకు సీపీ అభినందన

విశాఖ క్రైం: నగరంలో సంచలనమైన రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖాసీం హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఆరు కత్తులు, ఒక పిస్టల్, బుల్లెట్స్, స్టీల్‌ రాడ్‌ను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్‌ చేశారు. ఈ నెల 2వ తేదీ(గురువారం రాత్రి) 10.50 గంటల సమయంలో ఎల్‌ఐసీ భవనం దరి(అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో) ఖాసీంను చిట్టుమామూతో పాటు మరో ఆరుగురు కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మేరుగు చిట్టిబాబు–42(అలియాస్‌ చిట్టిమామూ), అంబటి మధుసూదనరావు–26(అలియాస్‌ రుషికొండ మధు), గుడ్ల వినోద్‌కుమార్‌రెడ్డి(26), శీలం సతీష్‌(23), సయ్యద్‌ రెహమాన్‌–24(అలియాస్‌ మున్నా), చొప్పా హేమంత్‌కుమార్‌(23), గత్తాడ శ్రీనివాస్‌(22)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్రలడ్డా వివరించారు.

గొడవలే హత్యకు కారణం
హత్యకు గురైన ఖాసీం, చిట్టిమామూ మధ్య కొన్నేళ్లుగా గొడవులు ఉన్నాయి. ఆధిపత్యం ఈ ముఠాలు ఘర్షణ పడుతుండేవి. ఖాసీం 2010 నుంచి పలు హత్య కేసుల్లో నిందితుడు. చిట్టిమామూ సోదరుడు, కంచరపాలేనికి చెందిన నగష్‌ను ఖాసీం హత్య చేశాడు. నగరంలో ఖాసీం, బత్తిన మురళీ, చిటిమామూల వర్గాల మధ్య వార్‌ జరుగుతుండడంతో వీరిపై పీడీ యాక్ట్‌ పెట్టారు. 2017లో చిట్టిమామూ, బత్తిన మురళీ జైలు నుంచి విడుదలయ్యారు. ఖాసీం ఈ ఏడాది జూన్‌ 12న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి చిట్టిమామూ.. ఖాసీంను హతమార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో చిట్టిమామూ మూడు నెలల కిందట మధు అనే వ్యక్తి పేరు మీద పాత ఆటో(ఏపీ31టీఏ 7472)ను కొనుగోలు చేశాడు. అనకాపల్లిలో సింగ్‌ల వద్ద కత్తులు కొనుగోలు చేశాడు. జూలై 27, 2018న చిట్టిమామూ.. మధుకు ఒక పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లు అందజేశాడు. దీంతో ఖాసీంను హతమార్చేందుకు వ్యూహం రచించారు. ముందుగా ఖాసీం వర్గానికి చెందిన బత్తిన మురళీని గురువారం(ఈనెల 2న) కైలాసపురంలో హత్య చేయడానికి చిట్టిమామూ ముఠా ప్లాన్‌ చేసింది. అయితే మురళీ చుట్టు పక్కల ఎక్కువ మంది జనాలు ఉండడంతో హత్యకు వీలు కాలేదు. అక్కడి నుంచి వెనుదిరిగిన చిట్టిమామూ ముఠా ఉదయం నుంచే ఖాసీం కదలికలపై రెక్కీ నిర్వహించింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఖాసీం డైమండ్‌ పార్కు సమీపంలోని సాయిరాం పార్లర్‌ వద్దకు వస్తాడన్న సమాచారంతో ఆర్యకుమార్, శ్యామ్, శ్రీను, వేముల ఆనంద్, పవన్, ప్రసాద్, గాది వెంకటేష్‌ కాపు కాశారు. అయితే ఖాసీం రాత్రి 10 గంటలకు సాయిరాం పార్లర్‌ వద్దకు వచ్చాడు.

హత్య చేయడానికి ప్రయత్నించినా జనాలు ఎక్కువగా ఉండడంతో అక్కడే కాపు కాశారు. ఖాసీం రాత్రి 10.30 గంటల సమయంలో సాయిరాం పార్లర్‌ నుంచి ఎల్‌ఐసీ భవనం మీదుగా డాబాగార్డెన్స్‌ వైపు హోండాయాక్టివ్‌(ఏపీ 31 డీఎన్‌ 8662)పై ఇంటికి వెళ్తున్నాడు. ఆయనను అంబటి మధు, జి.వినోద్‌రెడ్డి పల్సర్‌–220 మోటార్‌ బైక్‌పై, ఆటోలో సయ్యద్‌ రెహమాన్, చొప్పా హేమంత్‌కుమార్, శీలం సతీష్, రాజేష్‌ వెంబడించారు. రెహమాన్‌ డ్రైవింగ్‌ చేశాడు. హోండా యాక్టివ్‌ సాయి నడుపుతుండగా.. వెనక ఖాసీం కూర్చున్నాడు. ఆటోతో హోండో యాక్టివ్‌ను ఢీకొట్టారు. దీంతో కింద పడిన ఖాసీంను మధు పిస్టోల్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అది పేలకపోవడంతో ఆటోలో ఉన్న వారు కత్తులతో ఖాసీంపై దాడి చేశారు. తల, మెడ, కడుపుపై కత్తులతో బలంగా నరికేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు రాజేష్‌ పారిపోయాడు. మిగతా ఐదుగురు, చిట్టిమామూ ఇంటికి వెళ్లారు.

ఆ తరువాత ఐదుగురితో పాటు చిట్టిమామూ కలిసి మోటర్‌ సైకిల్, ఆటోలో ఎన్‌ఏడీ జంక్షన్‌కు వెళ్లి అక్కడున్న శ్రీనుకు పిస్టోల్‌ అందజేశారు. కశింకోట వెళ్లి స్నేహితుల వద్ద రూ.10 వేలు తీసుకొని అన్నవరం వెళ్లారు. అన్నవరంలోని బస్టాండ్‌ రోడ్డు వద్ద ఆటోను వదిలేసి, కాకినాడకు వెళ్లిపోయారు. మరుసటి రోజు 3న కారులో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లారు. మళ్లీ తిరిగి రాజమండ్రి జొన్నాడకు చేరుకున్నారు. మరో వైపు పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఎన్‌హెచ్‌–16 తాడి గ్రామంలో ఆటోల వెళ్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఆటోలో ఉన్న ఆరు కత్తులు, ఒక పిస్టోల్, ఒక స్టీల్‌ రాడ్, కారంపొడిని స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్‌ చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్రలడ్డా తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ
నగరంలో రౌడీయిజం చేస్తే తాటాతీస్తానని సీపీ హెచ్చరించారు. ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ ఫకీరప్ప, ఎస్‌బీ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఈస్ట్‌ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top