మహిళ కిడ్నాప్‌నకు యత్నం?

Uber Driver Tries to Kidnap Women in Hyderabad - Sakshi

క్యాబ్‌ దారి మళ్లించడంతో పోలీసులకు సమాచారం

డ్రైవర్‌ అరెస్టు..కథ సుఖాంతం

హైదరాబాద్‌, చంచల్‌గూడ: లండన్‌కు వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ మహిళను క్యాబ్‌ డ్రైవర్‌ దారి మళ్లించాడు. దీంతో భయబ్రాంతులకు గురైన మహిళ పోలీస్‌ కంట్రోల్‌ రూంకు, తన భర్తకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. దీంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి మాదన్నపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నారాయణగూడకు చెందిన సోనియా అనే మహిళ లండన్‌ వెళ్లేందుకు గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఊబర్‌ క్యాబ్‌ (వెరిటో ఏపీ 29 టీవీ 5733)ను బుక్‌ చేసింది. నారాయణగూడ నుంచి బయలు దేరిన క్యాబ్‌ గుర్తు తెలియని దారిలో వెళ్తుండడంతో ఆమె గుర్తించి డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగింది. కారు ఆపకపోవడంతో ఆమె తన భర్తతో పాటు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసింది.

ఈ లోగా కారు వేగంగా కుర్మగూడ డివిజన్‌ సాయిలాల్‌తోట వైపు చేరుకుంది. అక్కడ రోడ్డుపై టెంట్‌ అడ్డంగా ఉండటంతో కారు ఆపి డ్రైవర్‌ పారిపోయాడని, సోనియా కారు దిగి విలపించిందని  స్థానికులు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానం వెళ్లే సమయం కావడంతో సోనియాను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పంపించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా రూట్‌ మారడంతోనే మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చిందని, అందువల్లే తాను మాదన్నపేట పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరానని డ్రైవర్‌ తెలిపినట్లు తెలిసింది. డ్రైవర్‌కు, మహిళకు మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నామని సీఐ నగేష్, ఎస్‌ఐ మాధవ్‌రెడ్డి తెలిపారు. సోనియా తిరిగి ఇండియాకు వచ్చాక పూర్తిస్థాయిలో విచారిస్తామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top