నయీం ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు 

Two Years Completed To Nayeem Encounter - Sakshi

నేటికీ వెంటాడుతున్న జ్ఞాపకాలు

షాద్‌నగర్‌లో భయాందోళనలు రేపిన సంఘటన

మిలీనియం టౌన్‌షిప్‌లోని నయీం ఇంటికి ఇప్పటికీ తాళమే

షాద్‌నగర్‌టౌన్‌ రంగారెడ్డి : జలధరింపజేసిన పోలీసుల వేట... నయీం గుండెల్లోకి దూసుకెళ్లిన పోలీసుల తూట. స్థానికుల వదనాల్లో భయంతో నిండిన చమట.. ఒళ్లు గగుర్పాటు పొడింపించిన ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నయీం ఎన్‌కౌంటర్‌ జరిగి సరిగ్గా నేటితో రెండేళ్లు పూర్తయింది. వెన్నులో వణుకు పుట్టించిన ఘటనను షాద్‌నగర్‌ ప్రాంత వాసులు నేటికీ మరిచిపోలేకపోతున్నారు.  

ఉదయం 6గంటలకు 

2016 ఆగస్టు 8న షాద్‌నగర్‌ పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఒక్కసారిగా పోలీసులు ఓ ఇంటిని చుట్టుముట్టారు.  అసలు ఏం జరుగుతుందో కాలనీ వాసులకు అర్థం కాని పరిస్ధితి. భారీ ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలు మొహరించారు. తుపాకులెక్కుపెట్టి ఓ వ్యక్తిపై పోలీసులు ఏకదాటిగా కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైంది కరుడుగట్టిన నేరస్తుడు, వంద కేసుల్లో నిందితుడు, 40హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు నయీం అని ఆ రోజు తెలిసింది.  

వెంటాడుతున్న జ్ఞాపకాలు 

షాద్‌నగర్‌లోని మిలీనియంటౌన్‌షిప్‌ అంటేనే నయీం డెన్‌గా మారిపోయింది. మిలీనియం టౌన్‌షిప్‌లో ఇంటిని కొనుగోలు చేసి డెన్‌గా ఏర్పర్చుకొని రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించాడు. గుట్టు చప్పుడు కాకుండా నయీం షాద్‌నగర్‌కు వచ్చి వెళ్లేవాడు.

ఇంట్లో ఉండే వారు పెద్దగా బయటికి వచ్చే వారు కాదు. షాద్‌నగర్‌లోని ఇంటికి మామిడితోటగా పేరుపెట్టుకొని దందాలను నిర్వహించేవాడు. భారీ ఎత్తున సెటిల్‌మెంట్లు, మాటవినని వారిని హత్య చేసేందుకు ఇక్కడ నుండే పథకం రచించేవాడని సిట్‌ అధికారులు దర్యాప్తులో తేల్చారు.  

ఇప్పటికీ నయీం ఇల్లు మూతే 

మిలీనియం టౌన్‌షిప్‌లో సుమారు రెండు వందల చదరపు గజాల్లో ఉన్న ఇంటిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చెందిన సయ్యద్‌ సాధిక్‌పాషా పేరుపై 2012లో కొనుగోలు చేశాడు. నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ఇంట్లో దొరికిన సామగ్రిని వాహనాల్లో తరలించారు. అయితే సుమారు నాలుగేళ్ల పాటు షాద్‌నగర్‌ నుంచి నయీం కార్యకలాపాలు కొనసాగించాడు.

2016 ఆగస్టు నుంచి నయీం ఇల్లు మూత పడే ఉంది. ఇప్పటికీ నయీం ఇంటి వైపు వెళ్లాలంటే చాలా మంది జంకుతుంటారు. ప్రస్తుతం ఇంటి గేటుకు తాళం వేసి ఇంటి ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి చిందరవందరగా ఉంది. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ వారు మిలీని యం టౌన్‌ షిప్‌లో మొక్కలు పెంచేందుకు స్మృతి వనం ఏర్పాటు చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌ స్మృతి వనం ఎదుట జరిగింది.

అయితే ఎన్‌కౌంటర్‌ సమయంలో పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ఓ బుల్లెట్‌ స్మృతి వనం గేటుకు తాకడంతో రంద్రం పడింది. బుల్లెట్‌ తాకి గేటుకు రంద్రం పడిన దృశ్యం నేటికి కనిపిస్తుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top