కబళించిన మృత్యువు

Two Students Died In Godavari Canal East Godavari - Sakshi

ప్రాణం తీసిన చేపలవేట సరదా

వాగులో మునిగి ఇద్దరు బాలుర మృతి

చెన్నంపేటలో తీవ్ర విషాదం

తూర్పు గోదావరి,నెల్లిపాక (రంపచోడవరం): సరదాగా చేపల వేటకు వెల్లిన ఇద్దరు బాలురిని మృత్యువు కబళించింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీ చెన్నంపేటలో తీరని విషాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండి వీరభద్రం, గుండి చినరాజు అన్నదమ్ముల పిల్లలు. వీరభద్రం పెద్ద కుమారుడు రామకృష్ణ(10), చినరాజు ఒక్కగానొక్క కుమారుడు సాయికిరణ్‌(13), కల్లూరి నవీన్‌ (17) కలిసి ఆదివారం ఉదయం.. చెన్నంపేట వద్ద గోదావరి, వాగు సంగమంలో చేపలు పట్టేందుకు గేలాలు తీసుకుని వెళ్లారు. వాగు దాటి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు నవీన్‌.. రామకృష్ణ చేయి పట్టుకుని నీటి లోతును గమనిస్తూ మెల్లిగా వాగు దాటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడ్డున ఉన్న సాయికిరణ్‌ అకస్మాత్తుగా వారిద్దరి సమీపంలో నీటిలోకి దూకాడు.

ఊహించని ఈ పరిణామంతో కంగారు పడిన నవీన్, రామకృష్ణ పట్టు తప్పి వాగులో మునిగిపోయారు. వారితోపాటు సాయికిరణ్‌ కూడా మునిగిపోయాడు. ఎట్టకేలకు యువకుడైన నవీన్‌ బయటపడి ఒడ్డుకు చేరాడు. రామకృష్ణ (10), సాయికిరణ్‌ (13) గల్లంతయ్యారు. దీంతో నవీన్‌ అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లి సమీపంలోని కొందరికి విషయం తెలిపాడు. గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నగ్రామస్తులు వాగులో కొద్దిసేపు గాలించారు. చివరకు ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికితీశారు. అన్నదమ్ములిద్దరూ అనుకోని రీతిలో వాగులో పడి మృతి చెందటంతో చెన్నంపేట గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామకృష్ణ చంద్రంపాలెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సాయికిరణ్‌ అదే పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదివి గత ఏడాది నుంచి చదువు మానేశాడు. బిడ్డల మృతితో తల్లిదండ్రుల, బంధువులు బావురుమంటూ పెద్ద పెట్టున విలపించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌ సీపీ నాయకులు రమేష్‌నాయుడు, బొజ్జయ్య, కడియం రామాచారి పరామర్శించి, రూ.6 వేల ఆర్థిక సాయం అందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top