పండగవేళ విషాదం

Two Persons Die In Pond Khammam - Sakshi

సూర్యాపేట జిల్లాలో చెరువులో మునిగి ఖమ్మం వాసుల మృతి 

దుఃఖసాగరంలో రెండు కుటుంబాలు

ఖమ్మంక్రైం: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో చెరువులో మునిగి ఇద్దరు ఖమ్మం వాసులు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని తిరుమల థియేటర్‌ ప్రాంతానికి చెందిన పులిరాజుల నరసింహారావు(45) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్నాడు. మోతె మండలం నామారంలో తమ దగ్గర బంధువు మృతి చెందటంతో కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అంత్యక్రియలకు వెళ్లారు. ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి అక్కడే ఉన్న చెరువు గట్టు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి అందరూ ఈత కొడుతున్నారు.

ఇటీవలే చెరువులో పూడిక తీయటంతో వారికి లోతు అర్థంకాలేదు. నలుగురు చెరువులో దిగగా ఒక్కసారిగా వారు లోతుకు వెళ్లిపోయారు. ప్రమాదం నుంచి ఇద్దరిని రక్షించగా నరసింహారావు సోదరుడి కుమారుడైన పులిరాజుల నీరజ్‌(20) చెరువులో మునిగి పోతుండగా  కాపాడటానికి వెళ్లిన నరసింహారావు కూడా  మునిగిపోయాడు. నరసింహారావుకు ఈత వచ్చినా కూడా నీరజ్‌ను బయటకు తీసుకురాలేక ఇద్దరూ నీటిలో మునిగి మృతిచెందారు. వీరి మృతదేహాలను సూర్యాపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా పంచనామా నిర్వహించారు.

ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం..  
చెరువులో పడి మృతిచెందిన ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. నరసింహారావు కూతురు రెండు సంవత్సరాల క్రితమే ఇంటి గోడకూలి మృతిచెందగా.. ఇప్పటివరకు ఆ షాక్‌ నుంచి కుటుంబం కోలుకోలేదు. ఇప్పుడు కళ్లముందే నరసింహారావు చెరువులో మునిగి చనిపోవడంతో భార్య, ధనలక్ష్మి, కుమారుడు భరత్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబ పెద్దను కోల్పోవటంతో వారు దిక్కులేని వారుగా మిగిలిపోయారు. అదేవిధంగా మృతిచెం దిన మరో యువకుడు పులిరాజుల నీరజ్‌ ఖమ్మం లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ  చదువుతున్నాడు. అతని తండ్రి పులిరాజుల వెంకటేశ్వర్లు మిర్చివ్యాపారి.

వీరి కుటుంబం త్రీటౌన్‌ ప్రాంతం లోని సుగ్గలవారి తోటలో ఉంటున్నారు. ఒక్కగానొక్క కుమారుడు నీరజ్‌ మృతి చెందటంతో వెంకటేశ్వర్లు, అతని భార్య రమాదేవి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు కుమారుడి మృతితో మరింత కుంగిపోయాడు. సంక్రాంతి పండగ రెండు రోజుల్లో ఉండగా ఇద్దరి మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకొంది. ఇద్దరూ రక్తసంబదీకులు కావటంతో  కుటుంబ సభ్యులను ఓదార్చటం ఎవరితరం కావటంలేదు. వారి మృతదేహాలు సోమవారం ఖమ్మం రానున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top