పసివాడి బతుకు చిదిమాడు

Two arrested in kidnapping and killing of 7-year-old boy in vijayawada - Sakshi

విజయవాడలో బాలుడి దారుణ హత్య 

కాలువలో వేసి..  కాళ్లతో తొక్కి ఘాతుకం 

విజయవాడ/కృష్ణలంక(విజయవాడ తూర్పు): నిండా ఎనిమిదేళ్లు కూడా లేని ఓ పాలబుగ్గల పసివాడి ప్రాణాన్ని ఓ ఉన్మాది చిదిమేశాడు. అత్యంత కర్కశంగా కాలువలో ముంచి.. కాళ్లతో తొక్కి మరీ పసివాడి ఉసురు తీశాడు. అనంతరం ఆ కిరాతకుడు ఓ ఇంటర్‌ విద్యార్థి సహకారంతో కిడ్నాప్‌ డ్రామాకు తెరతీశాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. విజయవాడ డీసీపీ గజరావు భూపాల్‌ అందించిన వివరాల ప్రకారం.. 

షికారుకు వెళ్దామని..: విజయవాడ కృష్ణలంక రాణిగారితోట సంగుల పేరయ్యవీధికి చెందిన నడింపల్లి కనకారావు, శ్రీలత దంపతుల రెండో కుమారుడు శివచరణ్‌ (8) మూడో తరగతి చదువుతున్నాడు. శివచరణ్‌ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్నేహితులతో ఆడుకునేందుకు బయటకెళ్లాడు. రాజస్తాన్‌కు నుంచి వలస వచ్చిన మస్తాన్‌ (బిల్లా) అదే ప్రాం తంలో ఐస్‌క్రీం అమ్ముకుం టూ ఉంటాడు.  వ్యసనాల కు బానిసైన అతనికి కనకారావు కుటుంబంతో పరిచయముంది. ఈ నేపథ్యంలోనే  స్నేహితులతో ఆడుకుంటున్న శివచరణ్‌ను షికారుకని చెప్పి తన బైక్‌ మీద బందరు కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పూటుగా మద్యం తాగి ఉన్న మస్తాన్‌  ఉన్మాదంతో ఒక్కసారిగా  బాలుడి గొంతు పట్టుకుని కాలువలో ముంచి.. కాళ్లతో తొక్కి దారుణంగా హత్యచేశాడు. అనంతరం మస్తాన్‌ తనకు బాగా తెలిసిన ఓ ఇంటర్‌ విద్యార్థికి ఫోన్‌ చేసి పిలిపించి ఆ విద్యార్థి సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డు తీసుకుని తన ఫోన్‌లో వేసి బాలుడి తండ్రి కనకారావుకు ఫోన్‌ చేశాడు.రూ. లక్ష ఇవ్వకుంటే శివచరణ్‌ను చంపేస్తానని బెదిరించాడు. అప్పటికే  బిడ్డ కోసం వెదుకుతున్న కనకారావు దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

నగదును ఆ సందులో.. సైకిల్‌ మీద పెట్టండి!
అనంతరం కాసేపటికే మళ్లీ మస్తాన్‌ ఫోన్‌చేసి విజయవాడ బందరు రోడ్డులోని ఓ మాల్‌ సమీపంలోని సందులో ఉన్న సైకిల్‌ మీద నగదు పెట్టి వెళ్లాలని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో మాటువేశారు. కనకారావు నగదును ఆ సందులో ఉన్న సైకిల్‌ మీద పెట్టి వెళ్లిపోయారు. అనంతరం డబ్బు తీసుకునేందుకు వచ్చిన మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేసరికి బాలుడి హత్య విషయం చెప్పాడు. శనివారం ఉదయం ఇంటర్‌ విద్యార్థిని తను చదువుతున్న కాలేజీకి వెళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కాలువ నుంచి బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. విగతజీవుడిగా మారిన తమ బిడ్డను చూసిన కనకారావు దంపతుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. హృదయవిదారకంగా విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top