వెంటాడిన మృత్యువు | Tractor Roll Overed Mand Died In Srikakulam | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Nov 7 2018 6:58 AM | Updated on Nov 7 2018 6:58 AM

Tractor Roll Overed Mand Died In Srikakulam - Sakshi

బోల్తా పడిన ట్రాక్టర్‌

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలోని కుప్పిలి సమీపంలో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పిలి, బుడగట్లపాలెం గ్రామాల పరిధిలో చేపల చెరువుల కోసం నెల రోజులుగా కొత్తగా విద్యుత్‌ లైన్లు వేస్తున్నారు.  తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఈ పనులను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ట్రాక్టర్‌పై విద్యుత్‌ స్తంభాలను తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ట్రాక్టర్‌ ట్రాలీపై తొమ్మిది మంది కూలీలు కూర్చున్నారు. కుప్పిలి సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్‌ గోపీ బ్రేక్‌ వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

దీంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ట్రాలీలో కూర్చున్న కూలీలు కిందకు దూకేశారు. ఈ సమయంలో కింజరాపు నర్సింహులు (45) అనే వ్యక్తిపై స్తంభాలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనది శ్రీకాకుళం రూరల్‌ మండలం కంచుభూమయ్యపేట గ్రామం. మిగిలిన కూలీల్లో మెండ చిన్నారావు, రాజారావు, రమణలకు గాయాలయ్యాయి. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి పోలీసులకు, 108 అంబులెన్సుకు తెలియజేశారు. వెంటనే అంబులెన్సు సిబ్బంది వచ్చి క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు సంఘటన స్థల్నా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌ మార్చురీకి తరలించారు. గాయపడిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీపావళి పండగ ముందు ప్రమాదం జరగడంతో ఆయా కుటుంబాలు పెను విషాదంలో కూరుకుపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement