మాయదారి గోదారి... ముగ్గురిని మింగేసింది

Three Mans Dies In Godavari River Khammam - Sakshi

బూర్గంపాడు: మూడు కుటుంబాల ఆశాదీపాలు ఆరిపోయాయి. మిత్రులతో కలసి సరదాగా బయటకు వచ్చిన ఆ ముగ్గురు యువకులను మాయదారి గోదారి మింగేసింది. వారితోపాటు వచ్చిన మరో ముగ్గురు యువకులను షాక్‌కు గురిచేసింది. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కుందురు శ్రీనివాసరెడ్డి, కారంపూడి దుర్గ శేషు, తిరుమలరెడ్డి శివారెడ్డి, గాదె విజయ్‌కుమార్‌రెడ్డి, కుందురు సతీష్‌రెడ్డి, గాదె పుల్లారెడ్డి అలియాస్‌ పృధ్వీరెడ్డి కలిసి శనివారం మధ్యాహ్నం బూర్గంపాడు సమీపంలోని (ఆంధ్రా ప్రాంతంలోగల) గోదావరి–కిన్నెరసాని సంగమ ప్రాంతానికి వెళ్లారు. గాదె విజయ్‌కుమార్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సరదాగా అక్కడ విందు ఏర్పాటు చేసుకున్నారు.

తమ ఇళ్ల నుంచి తెచ్చిన భోజనం చేస్తున్నారు. ముందుగా భోజనం ముగించిన కుందురు శ్రీనివాసరెడ్డి (21), కారంపూడి దుర్గశేషు(24), తిరుమలరెడ్డి శివారెడ్డి (23)... సరదాగా ఈత కొడతామన్నారు. తమ సెల్‌ఫోన్లు, పర్సులు, దుస్తులను ఒడ్డున పెట్టి నీళ్ల లోకి దిగారు. ఒడ్డు నుంచి కొంచెం దూరం వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతూ... భయంతో ఒకరినొకరిని పట్టుకుని గట్టిగా కేకలు వేశారు. ఒడ్డున ఉన్న ఆ ముగ్గురు యువకులు పరుగు పరుగున ఒడ్డుకు వెళ్లేసరికే ఆ ముగ్గరూ మునిగిపోయారు.

భయాం దోళనతో నీళ్లలోకి దిగిన ఈ ముగ్గురినీ.. అక్కడ మేకలు మేపుతున్న కాపరులు గట్టిగా వారించారు. నీటి గుండాలు ఉన్నాయని, లోపలికి వెళ్తే తిరిగి రావడం కష్టమని హెచ్చరించటంతో వెనుదిరిగారు. వెంటనే ఆ ముగ్గురి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు, కుటుంబీకులతోపాటు బూర్గంపాడు, కుక్కునూరు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మత్స్యకారులు పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన ఆ ముగ్గురి యువకుల జాడ రాత్రి వరకు తెలియలేదు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతవటంతో నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో విషాదం అలుముకుంది.

ఇంటి దీపాలు వీరే... 
 కుందురు శ్రీనివాసరెడ్డి(21): సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో పర్మినెంట్‌ కార్మికుడిగా ఏడాదిన్నర నుంచి శిక్షణలో ఉన్నాడు. ఇతడి తండ్రి పెద్దిరెడ్డి కూడా ఐటీసీలోనే కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడి తల్లిదండ్రులు పెద్దిరెడ్డి, అనసూర్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

 కారంపూడి దుర్గశేషు(24): కుటుంబంలో ఇతడే పెద్ద కుమారుడు. ఇతడి తండ్రి సుబ్బారావు, అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందాడు. పెద్ద కొడుకైన దుర్గశేషు పైనే కుటుంబ బాధ్యత పడింది. ఐటీసీలోని ఓ కెమికల్‌ సంస్థలో ఇతడు పనిచేస్తున్నాడు. ఇటీవలనే ఉద్యోగం పర్మినెంట్‌ అయింది. పెళ్లి కూడా కుదిరింది. మరో నెల రోజుల్లో ముహూర్తం పెట్టుకోవాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దుర్గశేషుకు తల్లి వెంకటరమణ, తమ్ముడు ఉన్నారు. 

తిరుమలరెడ్డి శివారెడ్డి(23): ఖమ్మంలోని ఇన్సూరెన్స్‌ కంపెనీలో రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వరరెడ్డి, టైలర్‌గా పనిచేస్తున్నాడు. శివారెడ్డి సంపాదిస్తుండడంతో ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుటపడుతోంది. నాలుగు రోజుల క్రితమే ఖమ్మం నుంచి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top