చిట్స్‌ పేరుతో రూ. 3 కోట్లు ఎగనామం

three crore cheating on auction business

50 మందికి పైగా మోసం చేసిన సోదరులు

నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ప్రొద్దుటూరు క్రైం : వ్యాపారాలను అడ్డం పెట్టుకొని ఆ నలుగురు సోదరులు చీటీల వ్యాపారం ప్రారంభించారు. జల్సాలకు అలవాటు పడటంతో అనతి కాలంలోనే వ్యాపారంలో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో సుమారు 50 మందికి రూ. 3 కోట్లు పైగా ఇవ్వకుండా కుచ్చు టోపీ పెట్టారు. మోసం చేసిన నలుగురు సోదరులు మదనపల్లె షేక్‌ అబ్దుల్‌షుకూర్, ఖాజాపీర్, షఫీవుల్లా, కరీముల్లాలను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను శుక్రవారం వన్‌టౌన్‌  సీఐ వెంకటశివారెడ్డి వివరాలను వెల్లడించారు. ఆర్ట్స్‌కాలేజీ  రోడ్డుకు చెందిన అబ్దుల్‌షుకూర్, అతని ముగ్గురు సోదరులు బంగారు పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. దర్గా బజార్‌లో వీరు బంగారు దుణాలు, గోల్డ్‌ కవరింగ్‌ షాపులను ఏర్పాటు చేశారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లను నమ్మించి ఇటీవల ప్రైవేట్‌ చీటీల వ్యాపారాన్ని ప్రారంభించారు. కట్టిన డబ్బు ఇవ్వకుండా కొంత కాలం నుంచి కాలయాపన చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ నెలలో నలుగురు అన్నదమ్ములు ఇంటి నుంచి పారిపోయారు. విషయం తెలియడంతో చీటీలు వేసిన వారు లబోదిబో మంటూ వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. తనకు డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని శ్రీనివాసనగర్‌కు చెందిన షేక్‌ మస్తాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2న వారిపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఉన్న నలుగురు సోదరులను ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో వెళ్లి అరెస్ట్‌ చేశారు. దుబారా ఖర్చు, వడ్డీలు ఎక్కువ కావడం వల్ల నష్టాలు వచ్చినట్లు నిందితులు చెప్పినట్లు సీఐ తెలిపారు.

ప్రైవేట్‌ చీటీలు నడిపితే కేసులు..
అనుమతి లేకుండా చీటీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా చీటీలు నడిపే వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. అనుమతి లేకుండా నిర్వహించే వారి వద్ద వేసే చీటీలకు భద్రత ఉండదని, వారు మోసం చేసే అవకాశం ఉందని సీఐ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కలిగిన సంస్థల్లోనే డబ్బును పొదుపు చేసుకోవాలని  సీఐ సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top