నగరంలో దొంగలు హల్‌చల్‌ 

Thieves Halchal In Khammam - Sakshi

ఖమ్మం నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగలు హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడి లక్షలాది రూపాయల విలువ చేసే సొత్తును ఎత్తుకు పోతున్నారు. తాళం వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడు పోలీసు పెల్రోలింగ్‌ కొరవడటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రత్యేక కథనం..  

ఖమ్మంక్రైం: నెల రోజులుగా ఖమ్మం నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం çపగులగొట్టి ఇళ్లలో ఉన్న సొత్తును అపహరించుకుపోతున్నారు. నెల రోజుల్లో లక్షలాది రూపాయల సొత్తు దోచుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేసవికాలం కావటంతో ప్రజలు శుభకార్యాలు, విహార యాత్రలకు వెళుతుంటారు. దీన్ని అదునుగా చూసుకుని చాకచక్యంగా ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి తేలికగా దొంగతనాలు చేస్తున్నారు.

ఇతర ప్రాంతాల వారిపై అనుమానాలు.. 
ఖమ్మం నగరంతో పాటు  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దొంగల ముఠా విడిపోయి రెక్కీ చేస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట లేదా జనం రద్దీలేని సమయంలో తాళం పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు.  కొన్ని ప్రాంతాలలో వరుస ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలకు సైతం అనుమానాలు రాకుండా తమవద్ద ఉన్న వస్తువులతో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం శబ్దం రాకుండా చోరీలు చేస్తున్నారంటే దొంగతనాలు చేయటంలో వారు ఎంత నేర్పరులో ఇట్టే అర్థమవుతుంది. బయట ప్రాంతాల నుంచి వచ్చి చోరీలకు పాల్పడే వీరు గొళ్లెం కటింగ్, గ్రిల్స్‌కటింగ్, హాథర్‌ ఓల్‌ ద్వారా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభం నుంచి ముగిసేంతవరకు ఈ దొంగతనాలు చేస్తుంటారని తెలుస్తోంది. హాథర్‌ ఓల్‌ అంటే లోపలి నుంచి గొళ్లెం వేసి ఉన్న ఇంటికి తమ వద్ద వున్న హాథర్‌ ద్వారా ఓల్‌ చేసి లోపలికి జొరబడతారు. నీళ్లుపోసి ఓల్‌ చేస్తుంటే  శబ్దం రాదని పోలీసులు పేర్కొంటున్నారు.

పార్థీ, హవాయి, రాజస్థాన్‌ గ్యాంగ్‌లపై అనుమానాలు  
వరుస దొంగతనాలను బయట ప్రాంతాలకు చెందిన పార్థీ, హవాయి, రాజస్థాన్‌ గ్యాంగ్‌ల పనే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరంగల్‌లో  ఇదే తరహాలో దొంగతనాలు జరగటంతో అక్కడ పోలీసులకు  సీసీ పుటేజీ లభ్యమైంది. దొంగలు రాజస్థాన్‌కు చెందిన వారు అని తేలింది. అక్కడ నుంచి ఖమ్మం పోలీసులకు సీసీ పుటేజీలు లభించటంతో ఇక్కడ వున్న సీసీ పుటేజీలలో వారు, వీరు ఒక్కరేనేమోనని గుర్తిస్తున్నారు. కొత్తగూడెం ప్రాంతంలో సైతం అక్కడక్కడ దొంగతనాలు జరుగుతుండటంతో ఈ గ్యాంగ్‌ ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వీరు ఎక్కువగా రైల్వేస్టేషన్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రమే ఎంచుకుంటారు. దొంగతనం చేసిన వెంటనే గ్యాంగ్‌ విడిపోయి రైలు ఎక్కి వెళ్లిపోతారని తెలుస్తోంది. మొదట తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు, సరిహద్దుల్లో ఉండే ప్రాంతాల ఇళ్లను రెక్కీ నిర్వహించి  ఎంచుకొంటారు. కుక్కలు ఉండే ఇళ్లకు మాత్రం వీరు చోరీలకు ఎంచుకోరు. కదలికలు తెలిసి పోతాయని దొంగతనాలు చేయరు. అదేవిధంగా వేసవి కాలంలో చల్లటి గాలి కోసం ఆరుబయట పడుకొంటారు. దీంతో ఇంటి యజమానులకు శబ్దం రాకుండా జొరబడతారు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా వుంటే వారిని కొట్టి కట్టేసి దోపిడీకి పాల్పడుతుంటారు.

సీసీ కెమెరాలు ఎక్కడ.. 
జిల్లా వ్యాప్తంగా అమర్చిన సుమారు 125 సీసీ కెమెరాలలో సగానికి పైగా పనిచేయటం లేదని విశ్వసనీయ సమాచారం. ఈదురుగాలులతో పాటు, కొన్నింటిలో సాంకేతిక లోపం తలెత్తటంతో సీసీ కెమెరాలు పనిచేయటంలేదని పోలీసులు చెబుతున్నారు. వీటిని త్వరలోనే బాగు చేయించటం జరుగుతుందని చెబుతున్నారు. సీసీ మెమెరాలు పనిచేయకపోవటం వల్ల  దొంగలను పోలీసులు గుర్తించ లేకపోతున్నారు.
 
కొరవడిన పోలీసుల పెట్రోలింగ్‌   
నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నా పోలీసు పెట్రోలింగ్‌ నిఘా కొరవడటంతో దొంగలు  అలుసుగా తీసుకొని చోరీలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  పోలీసులు స్పందించటంలేదని, ప్రభుత్వం అత్యాధునిక వాహనాలు సమకూర్చినా వాటిని రోడ్లపై òపెట్టుకొని  కాలక్షేపం చేయటం తప్పా పెట్రోలింగ్‌ చేయటం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సిబ్బందితో పాటు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌ పోలీసులు ఉన్నా దొంగలను మాత్రం పట్టుకోవటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి బయటకు వచ్చిన వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయటకపోవటం కూడా దొంగలకు కలిసొస్తుందని పలువురు అంటున్నారు
  
నేరస్తులపై సరైన అవగాహన లేకపోవటం  
ఇప్పుడు ఉన్న క్రైం సిబ్బందికి నేరస్తులపై సరైన అవగాహన లేకపోవటం వల్ల చోరీలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.   గతంలో క్రైంతో పాటు ఐడీ పార్టీలలో పనిచేసి ఇప్పుడు వేరే ప్రాంతాలలో పనిచేస్తున్నవారికి నేరస్తులు, దొంగతనాలపై అవగాహన వుండేది. ప్రసుత్తం పనిచేస్తున్న వారికి సరైన అవగాహన లేకపోవటంతో పాటు జైలు జీవితం గడిపి వచ్చేవారిపై  ఆరాతీయలేకపోవటం, ప్రతిరోజూ వారి కదలికలను పసిగట్టలేకపోవడం కూడా దొంగతనాలు పెరగటానికి కారణం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇప్పుడు పనిచేస్తున్న వారికి పక్క జిల్లాలో పనిచేసే పోలీసులతో పరిచయాలు  లేకపోవటంతో దొంగల ఆచూకీ కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

అదేవిధంగా దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు వాడే అత్యాధునిక టెక్నాలజీపై చాలామంది పోలీసులకు అవగాహన లేదని తెలుస్తోంది. దీనికితోడు పై అధికారుల నుంచి సరైన హామీలు లేకపోవటంతో కష్టపడి దొంగల ఆచూకీ తెలుసుకొని పట్టుకోవడానికి వెళితే తీరా అక్కడ రక్షణ లేకపోవడంతో పాటు ఖర్చులను తమ జేబులో నుంచే పెట్టుకోవాల్సి పరిస్థితి ఎదురవుతుండటంతో చాలా మంది సిబ్బంది తమకు ఎందుకులే అని సరి పెట్టుకొంటున్నారు.

జిల్లాలో 25 చోరీ కేసులు నమోదు

నెల రోజుల్లో జిల్లాలో 25 కేసులు నమోదు కాగా, సుమారు 30 లక్షల రూపాయల విలువగల సొత్తును దొంగలు అపహరించుకుపోయారు. ఒక్క మే నెలలోనే ఈ కేసులు నమోదు కావటంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దొంగతనాలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు.

ఇటీవల వరుసగా జరిగిన చోరీల వివరాలు   

  •  ఖమ్మం టూటౌన్‌ ప్రాంతంలోని చైతన్యనగర్, రాపర్తినగర్‌ ప్రాంతంలో చోరీ చేశారు.  
  •  త్రీటౌన్‌ ప్రాంతంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి సుమారు రూ.8 లక్షల  సొత్తు ఎత్తుకెళ్లారు.  
  •  వన్‌టౌన్‌ ప్రాంతంలో బోనకల్‌ క్రాస్‌రోడ్, ముస్తఫానగర్, ప్రాంతాలలో చోరీలు చేశారు.  
  •  ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీనగర్‌కాలనీలో వరుస చోరీలకు పాల్పడ్డారు.  
  •  సత్తుపల్లి ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడ్డారు. 
  •  వైరా ప్రాంతంలో కూడా చోరీలు చేశారు.  
  • ఇప్పటికైనా పోలీస్‌ శాఖ స్పందించి వరుసగా చోటు చేసుకొంటున్న చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

చోరీలు అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం.. 
వరసుగా జరుగుతున్న చోరీలు అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా వరుసగా ఎన్నికలు రావటంతో సిబ్బంది బందోబస్తులో బిజీగా ఉండటంతో దొంగలు చోరీలు చేస్తున్నారు. చోరీలను ఆరికట్టేందుకు అన్ని ప్రాంతాలలో ప్రతి రోజూ రాత్రి ఒక ఎస్‌ఐ, ఏఎస్‌ఐ అధ్వర్యంలో పెట్రోలింగ్‌ చేయటానికి నిర్ణయంచాం. అదేవిధంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి బ్లూకోర్ట్‌ టీమ్‌తో పాటు పెట్రోలింగ్‌ వాహనాలు గస్తీ తిరుగుతాయి. వరుసగా చోరీలు చేస్తున్న సంఘటనలో ఒకబ్యాచ్‌ వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఫింగర్‌  ప్రింట్‌ ద్వారా వారి వివరాలను సేకరిస్తున్నాం. మాకున్న సమాచారం ప్రకారం చోరీలు రెండు ముఠాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఒక బ్యాచ్‌ ఇక్కడది కాగా, మరొక బ్యాచ్‌ బయట నుంచి వచ్చారని తెలుస్తోంది. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నాం.  ఖమ్మం ఏసీపీ వెంకట్రావ్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top