ఓటమి 'మంట'

TDP Leaders Fire Banana Crop in Dharmagiri Anantapur - Sakshi

‘ధర్మవరం‘లో తమ్ముళ్ల అరాచకం

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు, ఆస్తుల ధ్వంసం

ఓడిపోతున్నామనే అక్కసుతో దౌర్జన్యం

చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు

దందా.. దౌర్జన్యం.. అరాచకం... ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. అధికారంలో ఉన్న ఐదేళ్లూ టీడీపీ నేతలు ధర్మవరంలో జనాన్ని అష్టకష్టాలు పెట్టారు. ప్రతి పనిలోనూ ముడుపులు తీసుకున్నారు. రేషన్‌ కార్డు అయినా.. చేనేత పింఛన్‌ అయినా ‘పచ్చ’ మార్కు పడితేనే అన్నట్లు వ్యవహరించారు. నీతి, న్యాయం అనే పదాలకే అర్థం లేకుండా పాలన సాగించారు. ఇలాంటి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటై ఓటెత్తగా.. ఓటమి తప్పదని తెలుసుకున్న పచ్చమూక రెచ్చిపోతోంది. అక్కసుతో పోలింగ్‌ రోజు నుంచే వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు, ఆస్తుల ధ్వంసానికి తెగబడుతోంది. కాపాడాల్సిన ‘ఖాకీ’లు చేష్టలుడిగి చూస్తుండగా.. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

ధర్మవరం: ప్రజాక్షేత్రంలో పరువు పోయిందని తెలిసిందో.. అధికారం ఇక అందని ద్రాక్షేనని తెలుసుకున్నారో గానీ ధర్మవరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్‌ పూర్తయిన రోజు నుంచే రెచ్చిపోతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని, ఓటు వేయలేదని తెలిసిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అయితే తమ్ముళ్ల దౌర్జన్యాలను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన  పోలీసులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. ధర్మవరం మున్సిపాలిటీలో అర్ధరాత్రి వేళ టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు విసరడంతో పాటు కేకలు వేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి పూట వీధుల్లో ఇష్టారాజ్యంగా పెద్ద శబ్దంతో  బైకులు నడుపుతూ కేకలు వేస్తున్నారు. ఇక వార్డుల్లోవైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్ల ముందు ఉన్న అరుగుల మీద బండలు పగలగొడ్డడం లాంటి కవ్వింపు చర్యలకు దిగుతున్నారు.  

ముదిగుబ్బ మండలం దొరిగిల్లు రోడ్డులో ఉన్న పరమేశ్‌ అనే రైతుకు చెందిన అరటి తోటకు నిప్పుపెట్టారు. దీంతో సదరు రైతుకు 3 ఎకరాల అరటి చెట్లు, అందులో వేసి ఉన్న డ్రిప్‌పరికరాలు, ఇతర మోటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.5 లక్షల మేర అస్తి నష్టం జరిగింది.
ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు.  
వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపాడన్న కారణంతో పట్టణ ప్రముఖుడు నాగశేషుకు చెందిన హిటాచీ వాహనాలను, కంకర మిక్సింగ్‌ వాహనాలకు గేర్‌ బాక్స్‌లు, అద్దాలను ధ్వంసం చేయడంతో దాదాపు రూ.5 లక్షలు దాకా నష్టం వాటిల్లింది. ఇలా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.

మంటల్లో కాలిపోతున్న అరటితోట
కంకర కలిపే యంత్రం దగ్ధం 
ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీకి నేత నాగశేషుకు సంబంధించిన కంకర కలిపే యంత్రానికి నిప్పుపెట్టారు. ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్లనంతపురం సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి పనులలో భాగంగా కాంట్రాక్టర్‌ నాగశేషు కంకర యంత్రాన్ని వినియోగిస్తుండగా... ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు యంత్రాలపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి పరిశీలించారు. అప్పటికే యంత్రం మంటల్లో కాలిపోయింది. 

ముఖ్యనేత అనుచరుడి నేతృత్వంలోనే..
ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన అందరినీ బెదిరించేందుకు ధర్మవరం ముఖ్యనేత అనుచరులు ఇద్దరు ఈ టీంను నడుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 20 మంది అనుచరులున్న ఈ బృందం సభ్యులు నియోజకవర్గంలో వాహనాల్లో పర్యటిస్తూ వైఎస్సార్‌ సీపీ నేతలు, సానుభూతి పరుల ఆస్తుల ధ్వంసానికి పథకం రచించినట్లు తెలిసింది.  

పట్టించుకోని పోలీసులు
టీడీపీ నేతలు ఆస్తుల ధ్వంసంతో పాటు...భౌతిక దాడులకు దిగుతున్నా... పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. తమపై ఫలానా వారు దాడి చేశారని బాధితులసు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా ఉన్నతాధికారులు స్పందించి దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను అదుపుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దుండగులు నిప్పంటించగా కాలిబూడిదైన అంబులెన్స్‌
అంబులెన్స్‌కు నిప్పు పెట్టిన టీడీపీ నాయకులు
ముదిగుబ్బ: వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలిపాడన్న కక్షతో మండలంలోని ఈదులపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డికి చెందిన అంబులెన్స్‌కు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఎమ్మెల్యే సూర్యనారాయణ కుమారుడు నితిన్‌ సాయి ఈదులపల్లి గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు. అయితే రాత్రి పడుకునే సమయంలో మైకుల గోల ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. వీరిలో ప్రతాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. దీంతో నితిన్‌ సాయి అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. వెంటనే పోలీసులు రావడంతో ‘‘మీ అంతు మళ్లీ చూస్తాం’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలింగ్‌ మరుసటి రోజే (12వ తేదీ) టీడీపీ నాయకులు దారి కాచి ఈదులపల్లికి చెందిన లక్ష్మిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటన మరువక ముందే ఈదులపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి ముదిగుబ్బలో నివాసం ఉంటుండగా....అక్కడ రెక్కీ నిర్వహించిన నితిన్‌ సాయి అనుచరులు ఇంటి ముందు నిలిపిన అంబులెన్స్‌కు శనివారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ మంటల్లో అంబులెన్స్‌ దహనం కాగా... సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. కొంతమంది టీడీపీ నాయకులపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top