మంత్రి పేరుతో నకిలీ సిఫార్సు లేఖ..

TDP Leader Fraud With Minister Letterpad Forgery Signature YSR Kadapa - Sakshi

రూ. కోటి విలువైన భూమికి ఎసరు

రాష్ట్ర మంత్రి సంతకాన్నిఫోర్జరీ చేసి నకిలీ సిఫార్సు లేఖతో

ప్రభుత్వ భూమినికాజేయాలనుకున్నటీడీపీ నాయకుడు

మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు పరారీలో కేటుగాడు

రాయచోటి/చిన్నమండెం : రాష్ట్ర మంత్రి లెటర్‌ప్యాడ్‌పై నకిలీ సిఫార్సు లేఖను సృష్టించి  ఆపై మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.కోటి రూపాయలకు పైగా విలువున్న ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన ఓ టీడీపీ నాయకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. చిన్నమండెం మండలంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న భూమిలో బ్రిటీష్‌ కాలంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. తర్వాత కాలంలో భవనం పాడుబడి ఖాళీగా మారింది. ఈ భూమిపై కన్నేసిన రెడ్డెప్ప ఒక ఎకరా 26 సెంట్ల భూమిని కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి టి.వనిత లెటర్‌ ప్యాడ్‌నే ఫోర్జరీ లేఖగా మార్చేశాడు. చిన్నమండెం మండలం కేశాపురం పంచాయతీ దేవళంపేటకు చెందిన ఎం.రెడ్డెప్ప గ్రామంలో టీడీపీ నాయకునిగా చలామణి అవుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన, డ్రిప్‌ ఇరిగేషన్, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల నుంచి బినామీల పేర్లతో లక్షల రూపాయలను సబ్సిడీల రూపంలో దోచుకున్నాడనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ రెడ్డెప్ప తనకున్న తెలివితో తనకు సమీప బంధువుగా పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి పేరును అడ్డు పెట్టుకుని మంత్రి లేఖను సంపాదించినట్లుగా సమాచారం. ఆ లేఖతో గ్రామంలోని సర్వే నంబరు 1648–3లోని ఎకరా 26 సెంట్ల భూమిని ఎం.రెడ్డెప్పకు కేటాయించాలంటూ సిఫారసు లేఖను సృష్టించాడు. ఆ లేఖను చిన్నమండెం మండల తహసీల్దార్‌ జీవీ నాగేశ్వరరావుకు రెండు రో జుల క్రితం అందజేసి ఖాళీగా ఉన్న ఈ భూమిని తనకు కేటాయించాలని కోరాడు. ఆ స్థలాన్ని తనకు కేటాయిస్తే చిన్నతరహా పరిశ్రమను స్థాపించుకుంటానని ఆ లేఖ ద్వారా పేర్కొన్నాడు. మంత్రి లేఖను చూసి ఆగ మేఘాలపై స్పందించిన చిన్నమండెం మండల తహసీల్దార్‌ స్థలానికి సంబంధించిన రికార్డులకు ఫోర్జరీ లేఖను జత చేసి కలెక్టరు కార్యాలయానికి ఈనెల 12వ తేదీన పంపారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు లేఖపై ఆరా తీస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మంత్రి వనితల దృష్టికి చిన్నమండెం మండల వైఎస్సార్‌సీపీ నాయకులు తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి చిన్నమండెం మండలం కేశాపురానికి చెందిన రెడ్డెప్పకు తాను లేఖను ఇవ్వలేదని ఇక్కడి రెవెన్యూ అధికారులకు సమాచారం పంపారు. లేఖ ప్రతులను ఇంటర్‌నెట్‌ సాయంతో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తన సంతకాలను ఫోర్జరీ చేసిన విధానాన్ని చూసి అవాక్కైన మంత్రి ఈ లేఖలో ఉన్న సంతకం తనది కాదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తన శాఖాధికారులను ఆదేశించారు. దీంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి లేఖను ఫోర్జరీ చేసిన టీడీపీ నాయకుడు ఎం.రెడ్డెప్పపై చిన్నమండెం తహసీల్దార్‌ జి.వి.నాగేశ్వరరావు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

రెడ్డెప్ప కోసం గాలిస్తున్న పోలీసులు...
మంత్రి లెటర్‌ ప్యాడ్‌ను ఫోర్జరీ చేసిన విషయం బట్టబయలు కావడంతో టీడీపీ నాయకుడు ఎం.రెడ్డెప్ప అదృశ్యమయ్యాడు. తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై రాయచోటి రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, చిన్నమండెం ఎస్‌ఐ హేమాద్రిలు రెడ్డెప్పను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే రెడ్డెప్ప ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి గ్రామం వదలి రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్‌ఐ హేమాద్రి మాట్లాడుతూ తహసీల్దార్‌ జి.వి.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎం.రెడ్డెప్ప పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top