అనుమానమే ఆయువు తీసింది

Suspected Wife Killed by Husband In Kunool - Sakshi

సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పదిహేనేళ్ల క్రితం తనతో ఏడడుగులు నడిచి అన్నింటిలోనూ తోడుగా నిలిచిన భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. ఎంతలా అంటే చివరికి ఆమెను పెట్రోలు పోసి హత్య చేసేంతలా. ఆదివారం కోవెలకుంట్ల పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు హత్యకేసు వివరాలను వెల్లడించారు. దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన కొండన్న కుమారుడు నరసింహులు అనే వ్యక్తికి అదే మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పరిమళతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య  జీవితానికి గుర్తుగా కుమారుడు, కుమార్తె జన్మించారు. మూడేళ్ల క్రితం కుమార్తె క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువాత పడింది. ఇదిలా ఉండగా భర్త గత కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకోవడంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత నెల 23న ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో నరసింహులు తండ్రి కొండన్న కోడలిని చంపేస్తే పీడ విరగడవుతుందని కుమారుడికి చెప్పడంతో పవర్‌ స్ప్రెయర్‌ను స్టార్ట్‌ చేసేందుకు తెచ్చుకున్న పెట్రోల్‌ను భార్యపై చల్లి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న పరిమళను గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల్లో ఉన్న పరిమళ వాగ్మూలం మేరకు భర్త, మామపై దొర్నిపాడు పోలీస్‌స్టేషన్‌ హత్యయత్నం కేసు నమోదైంది. ఇరవై నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి కోలుకోలేక శనివారం మృతి చెందింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు గ్రామ శివారులో హతురాలి భర్త, మామలను అరెస్టు చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో  కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top